
రాష్ట్రంలోని ప్రతి గ్రామీణ కుటుంబానికి సురక్షితమైన, నాణ్యమైన తాగునీటిని ఇంటింటికి అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘జల జీవన్ మిషన్–అమరజీవి జలధార’ బృహత్తర కార్యక్రమానికి వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గ కేంద్రంగా సోమవారం ఘనంగా శ్రీకారం చుట్టారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీ మాధవ్ చేతుల మీదుగా ప్రొద్దుటూరులో పైలాన్, శిలా ఫలకాలు ఆవిష్కరించి రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న తాగునీటి అభివృద్ధి పనులను లాంఛనంగా ప్రారంభించారు.
గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు రాబోయే మూడు దశాబ్దాల నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ ప్రణాళిక ద్వారా రాష్ట్రంలోని కోట్లాది ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందుబాటులోకి రానుంది. రూ.30,156 కోట్ల భారీ అంచనా వ్యయంతో చేపట్టిన ఈ కార్యక్రమం రాష్ట్ర గ్రామీణ నీటి సరఫరా వ్యవస్థలో సమూల మార్పునకు నాంది పలకనుంది.
ప్రతి ఇంటికీ కుళాయి.. ప్రతి కుటుంబానికీ స్వచ్ఛమైన నీరు
‘జల జీవన్ మిషన్–అమరజీవి జలధార’లో భాగంగా రాష్ట్రంలోని గ్రామీణ కుటుంబాలకు స్థిరమైన నీటి వనరుల ద్వారా తగిన పరిమాణంలో, సురక్షితమైన తాగునీటిని అందించనున్నారు. ఒక్కో వ్యక్తికి రోజుకు సగటున 55 లీటర్ల నీరు అందించేలా ప్రణాళిక రూపొందించారు.
రాష్ట్రవ్యాప్తంగా 32 సమగ్ర తాగునీటి సరఫరా పథకాలు, 50,283 ఏక గ్రామ తాగునీటి సరఫరా పథకాలు చేపట్టడం ద్వారా సుమారు 3.27 కోట్ల గ్రామీణ ప్రజలకు ప్రయోజనం చేకూరనుంది.
ఈ కార్యక్రమంలో భాగంగా 1,426 ఎంఎల్డీ సామర్థ్యంతో నీటిశుద్ధి కేంద్రాలు, 14,995 నీటి నిల్వ నిర్మాణాలు, 77,243 కిలోమీటర్ల పైప్లైన్లు, 27.36 లక్షల ఇంటింటి కుళాయి కనెక్షన్లు ఏర్పాటు చేయనున్నారు.
*కడపతో పాటు రాయలసీమకు గండికోట జలాశయం ద్వారా నీటి భద్రత..*
- మదనపల్లె విభాగం సమగ్ర రక్షిత తాగునీటి సరఫరా పథకం – రెండో దశ
నీటి వనరు: గండికోట జలాశయం
అంచనా వ్యయం: రూ.1,000 కోట్లు
లబ్ధి: 3 మండలాలు, 642 ఆవాసాలు, 5.35 లక్షల జనాభా.
గండికోట జలాశయాన్ని ప్రధాన నీటి వనరుగా వినియోగిస్తూ మదనపల్లి విభాగంలో సమగ్ర రక్షిత తాగునీటి సరఫరా పథకం రెండో దశను చేపట్టనున్నారు. ఈ పథకం ద్వారా మూడు మండలాల్లోని 642 ఆవాసాలకు తాగునీటి భద్రత కల్పించడంతో పాటు సుమారు 5.35 లక్షల మంది ప్రజలకు సురక్షితమైన నీరు అందుబాటులోకి రానుంది.
- పుంగనూరు–పలమనేరు–కుప్పం విభాగాల సమగ్ర రక్షిత తాగునీటి సరఫరా పథకం – రెండో దశ
నీటి వనరు: గండికోట జలాశయం
అంచనా వ్యయం: రూ.1,886 కోట్లు
లబ్ధి: 17 మండలాలు, 2,670 ఆవాసాలు, 16.11 లక్షల జనాభా.
గండికోట జలాశయం నుంచి నీటిని సేకరించి పుంగనూరు, పలమనేరు, కుప్పం విభాగాల్లోని గ్రామీణ ప్రాంతాలకు సరఫరా చేసేలా ఈ భారీ పథకాన్ని రూపొందించారు. 17 మండలాల్లోని 2,670 ఆవాసాలకు రక్షిత తాగునీటి సదుపాయం కల్పించడం ద్వారా 16.11 లక్షల మంది ప్రజలకు ప్రయోజనం చేకూరనుంది.
- అవుకు జలాశయం–బనగానపల్లె తాగునీటి పథకం
నీటి వనరు: అవుకు జలాశయం
అంచనా వ్యయం: రూ.510 కోట్లు
లబ్ధి: 161 ఆవాసాలు, 3.91 లక్షల జనాభా.
అవుకు జలాశయం నుంచి నీటిని సేకరించి బనగానపల్లె నియోజకవర్గంలోని 161 ఆవాసాలకు రక్షిత తాగునీటిని అందించనున్నారు. ఈ పథకం ద్వారా 3.91 లక్షల మంది ప్రజలకు ప్రయోజనం కలగనుంది.
- పీఏబీఆర్ జలాశయం–రాయదుర్గం సమగ్ర తాగునీటి పథకం
నీటి వనరు: పీఏబీఆర్ జలాశయం
అంచనా వ్యయం: రూ.390 కోట్లు
లబ్ధి: 153 ఆవాసాలు, 4.68 లక్షల జనాభా.
పీఏబీఆర్ జలాశయాన్ని ఆధారంగా చేసుకుని రాయదుర్గం నియోజకవర్గంలోని 153 ఆవాసాలకు తాగునీటి సరఫరా వ్యవస్థను అభివృద్ధి చేయనున్నారు. సుమారు 4.68 లక్షల మందికి ఈ పథకం ద్వారా ప్రయోజనం చేకూరుతుంది.
- పీఏబీఆర్ జలాశయం–ఉరవకొండ తాగునీటి పథకం
నీటి వనరు: పీఏబీఆర్ జలాశయం
అంచనా వ్యయం: రూ.480 కోట్లు
లబ్ధి: 139 ఆవాసాలు, 3.75 లక్షల జనాభా.
ఉరవకొండ నియోజకవర్గంలోని 139 ఆవాసాలకు పీఏబీఆర్ జలాశయం నుంచి రక్షిత తాగునీటిని అందించేందుకు ఈ పథకాన్ని చేపడుతున్నారు. 3.75 లక్షల మంది ప్రజలకు సురక్షితమైన తాగునీటి వసతి కలగనుంది.
- ధవళేశ్వరం–కడియం ప్రాంత సమగ్ర తాగునీటి పథకం
నీటి వనరు: ధవళేశ్వరం వద్ద గోదావరి
అంచనా వ్యయం: రూ.194 కోట్లు
లబ్ధి: 110 ఆవాసాలు, 5.71 లక్షల జనాభా.
గోదావరి జలాలను వినియోగించుకుని కడియం, పరిసర ఆవాసాలకు రక్షిత తాగునీటి సరఫరా అందించేలా ఈ పథకాన్ని రూపొందించారు. 110 ఆవాసాల్లోని 5.71 లక్షల మందికి దీని ద్వారా ప్రయోజనం చేకూరనుంది.
- ఏలేరు జలాశయం–కాకినాడ విభాగం సమగ్ర తాగునీటి పథకం
నీటి వనరు: ఏలేరు జలాశయం
అంచనా వ్యయం: రూ.1,641 కోట్లు
లబ్ధి: 453 ఆవాసాలు, 11.40 లక్షల జనాభా.
ఏలేరు జలాశయం నుంచి నీటిని సేకరించి కాకినాడ విభాగంలోని 453 ఆవాసాలకు రక్షిత తాగునీటిని అందించనున్నారు. ఈ భారీ పథకం ద్వారా 11.40 లక్షల మంది ప్రజలకు నీటి భద్రత లభించనుంది.
- ఏలేరు జలాశయం–అనకాపల్లి విభాగం సమగ్ర తాగునీటి పథకం
నీటి వనరు: ఏలేరు జలాశయం
అంచనా వ్యయం: రూ.1,550 కోట్లు
లబ్ధి: 895 ఆవాసాలు, 13.07 లక్షల జనాభా.
అనకాపల్లి విభాగంలోని 895 ఆవాసాలకు ఏలేరు జలాశయం నుంచి రక్షిత తాగునీటిని అందించేలా ఈ పథకం చేపడుతున్నారు. సుమారు 13.07 లక్షల మంది ప్రజలకు దీని ద్వారా ప్రయోజనం కలుగుతుంది.
- తాండవ జలాశయం–నర్సీపట్నం తాగునీటి పథకం
నీటి వనరు: తాండవ జలాశయం
అంచనా వ్యయం: రూ.500 కోట్లు
లబ్ధి: 328 ఆవాసాలు, 3.15 లక్షల జనాభా.
తాండవ జలాశయం నుంచి నీటిని సేకరించి నర్సీపట్నం నియోజకవర్గంలోని 328 ఆవాసాలకు రక్షిత తాగునీటిని అందించనున్నారు. 3.15 లక్షల మంది ప్రజలకు ఈ పథకం ప్రయోజనం చేకూర్చనుంది.
- హీరమండలం–టెక్కలి, నరసన్నపేట సమగ్ర తాగునీటి పథకం
నీటి వనరు: హీరమండలం జలాశయం
అంచనా వ్యయం: రూ.1,204 కోట్లు
లబ్ధి: 1,458 ఆవాసాలు, 11.55 లక్షల జనాభా.
హీరమండలం జలాశయాన్ని ఆధారంగా చేసుకుని టెక్కలి, నరసన్నపేట నియోజకవర్గాల్లోని 1,458 ఆవాసాలకు రక్షిత తాగునీటి సరఫరా కల్పించనున్నారు. ఈ పథకం ద్వారా 11.55 లక్షల మంది ప్రజలకు నీటి భద్రత లభించనుంది.
- పురుషోత్తపట్నం–రాజానగరం తాగునీటి పథకం
నీటి వనరు: పురుషోత్తపట్నం వద్ద గోదావరి
అంచనా వ్యయం: రూ.215 కోట్లు
లబ్ధి: 93 ఆవాసాలు, 4.14 లక్షల జనాభా.
గోదావరి జలాలను వినియోగించుకుని రాజానగరం నియోజకవర్గంలోని 93 ఆవాసాలకు రక్షిత తాగునీటి సరఫరా వ్యవస్థను అభివృద్ధి చేయనున్నారు. 4.14 లక్షల మంది ప్రజలకు ఈ పథకం ద్వారా ప్రయోజనం చేకూరనుంది.
- కృష్ణా తీర ప్రాంత ఆవాసాల సమగ్ర రక్షిత తాగునీటి సరఫరా పథకం
అంచనా వ్యయం: రూ.750 కోట్లు
లబ్ధి: 601 ఆవాసాలు, 5.86 లక్షల జనాభా.
కృష్ణా తీర ప్రాంతంలోని 601 ఆవాసాలకు సమగ్ర రక్షిత తాగునీటి సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. రూ.750 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే ఈ పథకం ద్వారా 5.86 లక్షల మంది ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందుబాటులోకి రానుంది.
- 28 జిల్లాల్లో 8,494 ఏక గ్రామ తాగునీటి పథకాలు
రాష్ట్రంలోని 28 జిల్లాల్లో 8,494 ఏక గ్రామ తాగునీటి సరఫరా పథకాలను రూ.3,297 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్నారు. వీటి ద్వారా 28,089 ఆవాసాల్లోని సుమారు 239.13 లక్షల మంది ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించనున్నారు. గ్రామ స్థాయిలోనే నీటి వనరులను అభివృద్ధి చేసి ఇంటింటికీ కుళాయి ద్వారా సురక్షితమైన నీటిని అందించడమే ఈ పథకాల ప్రధాన ఉద్దేశ్యం.
- రాబోయే 30 ఏళ్ల నీటి అవసరాలకు ప్రణాళిక…*
జల జీవన్ మిషన్–అమరజీవి జలధార కేవలం ప్రస్తుత అవసరాలను తీర్చే పథకంగా కాకుండా రాబోయే 30 సంవత్సరాల గ్రామీణ తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించడం ప్రత్యేకత. నీటి వనరుల లభ్యత, నీటి శుద్ధి, నిల్వ, పంపిణీ, పైప్‌లైన్ వ్యవస్థలను సమగ్రంగా అభివృద్ధి చేసి భవిష్యత్ తరాలకు కూడా తాగునీటి భద్రత కల్పించేలా ప్రణాళిక రూపొందించారు.
- 27.36 లక్షల కుటుంబాలకు ఇంటింటికీ కుళాయి…*
ఈ బృహత్తర కార్యక్రమంలో భాగంగా 27.36 లక్షల ఇంటింటి కుళాయి కనెక్షన్లు ఏర్పాటు చేయనున్నారు. దీంతో గ్రామీణ కుటుంబాలు దూర ప్రాంతాల నుంచి నీటిని తెచ్చుకునే పరిస్థితి తగ్గి, ఇంటి వద్దనే సురక్షితమైన తాగునీరు అందుబాటులోకి రానుంది. మహిళలు, పిల్లలపై నీటి సేకరణ భారం తగ్గడంతో పాటు గ్రామీణ కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగుపడనున్నాయి.
- జల జీవన్ మిషన్‌కు కొత్త ఊపు..*
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం జల జీవన్ మిషన్ అమలును పునఃసమీక్షించి, రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా సమగ్ర ప్రణాళిక రూపొందించింది. రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన పనులను పూర్తి చేసి ప్రతి గ్రామీణ కుటుంబానికి కుళాయి కనెక్షన్ అందించేందుకు కార్యాచరణ రూపొందించగా, కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించి పనులను పూర్తి చేసేందుకు 2028 డిసెంబర్ వరకు గడువు కల్పించింది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో చేపడుతున్న ఈ బృహత్తర కార్యక్రమం గ్రామీణ ఆంధ్రప్రదేశ్‌లో తాగునీటి వసతుల రూపురేఖలను మార్చే స్థాయిలో ఉండనుంది.
- ప్రొద్దుటూరు వేదికగా అభివృద్ధికి మరో చారిత్రక అడుగు..*
రాష్ట్రవ్యాప్తంగా కోట్లాది ప్రజలకు ప్రయోజనం చేకూర్చే ‘జల జీవన్ మిషన్–అమరజీవి జలధార’ రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని ప్రొద్దుటూరు వేదికగా ప్రారంభించడం వైఎస్ఆర్ కడప జిల్లాకు ప్రత్యేక ప్రాధాన్యతను తీసుకొచ్చింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీ మాధవ్ చేతుల మీదుగా పైలాన్ ఆవిష్కరణతో రాష్ట్రవ్యాప్తంగా తాగునీటి అభివృద్ధి పనులకు కొత్త వేగం లభించింది.
ప్రతి ఇంటికీ కుళాయి.. ప్రతి కుటుంబానికీ స్వచ్ఛమైన నీరు.. ప్రతి గ్రామానికీ శాశ్వత నీటి భద్రత అనే లక్ష్యంతో సాగుతున్న ఈ కార్యక్రమం గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు సుస్థిర అభివృద్ధికి బలమైన పునాది వేయనుంది. స్వచ్ఛమైన తాగునీరు అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ భారీ కార్యక్రమం స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణంలో ఒక కీలక మైలురాయిగా నిలవనుంది.


