Skip to main content

Baskar Pedia

తన ప్రజల స్వేచ్చా జీవనాన్ని కోరుతూ.. బ్రిటిష్ పాలనను అంతమొందించేందుకు తన ప్రాణాలను త్యాగం చేసిన దేశభభక్తుడు, తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డే ఓబన్న అని.. నేటి యువతరానికి ఆయన ఆదర్శమని  డీ ఆర్వో విశ్వేశ్వర నాయుడు అన్నారు. ఆదివారం కలెక్టరేట్ లోని పీజీఆర్ఎస్ హాలులో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో  స్వాతంత్య్ర సమరయోధులు వడ్డే ఓబన్న 219వ జయంతి నిర్వహించారు.  డీఆర్వో విశ్వేశ్వర నాయుడు మాట్లాడుతూ వడ్డే ఓబన్న 11 జనవరి 1807న నంద్యాల జిల్లా, సంజమల మండలంలోని నొస్సం గ్రామంలో జన్మించారని,  గ్రామ రక్షకునిగా (తలారి) పనిచేశారని, బ్రిటిష్ పాలనతో గ్రామ రక్షకుల జీతాలు రద్దు చేసిన తరువాత, రైతులపై అధిక పన్నులు విధించడం ప్రారంభించడంతో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమం మొదలైందన్నారు. 1845లో వడ్డే ఓబన్న ఈ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టారని పేర్కొన్నారు. ఈ ఉద్యమం శ్రీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి నేతృత్వంలో సాగిందని, ముఖ్యంగా రైతుల హక్కులను రక్షించడానికి, వారి న్యాయం కోసం పోరాడటానికి మరియు బ్రిటిష్ అధికారానికి వ్యతిరేకంగా నినాదం చేయడం జరిగిందన్నారు. 1846 జూలై 10న, కోవెలకుంట్ల తహసీల్దార్ కార్యాలయం, ఖజానాపై దాడి చేసిన తరువాత వడ్డే ఓబన్న నేతృత్వంలో గ్రామస్తులు ఖజానా నిధులను సర్వత్రా పీడనకు గురైన రైతులకు పంపిణీ చేశారన్నారు. ఈ ఘటనకు ప్రతిగా, బ్రిటీష్ అధికారులు జాన్ కోక్రెస్ నేతృత్వంలో తిరుగుబాటుదారులపై పోరు ప్రకటించారన్నారు. జూలై 23 నుండి అక్టోబర్ 6 వరకు జరిగిన అనేక యుద్ధాల్లో  వడ్డే ఓబన్న తన సైన్యంతో కలిసి ధైర్యంగా పోరాడారని.. ఆయన సైన్యంలో వడ్డే, బోయ, యానాది, చెంచు వంటివారు భాగస్వాములుగా ఉన్నారని తెలిపారు.  అనేక కష్టాలు, వంచెనల మధ్య బ్రిటిష్ దండనలను ఎదుర్కొంటూ ఓబన్న పోరాటం సాగించారన్నారు. వడ్డే ఓబన్న.. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రజల కోసం చేసిన పోరాటంలో ఒక కీలక పాత్ర పోషించారని.. ఆయన నేతృత్వంలో జరిగిన ఉద్యమం, 1857లో జరిగిన స్వాతంత్ర్య సమరానికి ముందు భారతదేశంలోని బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన ప్రతిఘటనలో ఒక ముఖ్యమైన భాగంగా నిలిచిందన్నారు. శ్రీ వడ్డే ఓబన్న తన ప్రజల కోసం, రైతుల కోసం, బ్రిటిష్ పాలనను అంతమొందించేందుకు చేసిన త్యాగం, దేశభక్తి, దైర్యం ప్రజల హృదయాలలో నిలిచిపోయింది. ఆయన వీరత్వం మరింతగా తెలుగు రాష్ట్రలలో గుర్తించబడిందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *