
ప్రపంచ చారిత్రక నీటిపారుదల కట్టడంగా అతి పురాతనమైన కర్నూలు-కడప కాలువ (కేసీకాలువ) గుర్తింపు పొందింది. ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజీ సంస్థ న్యాయ నిర్ణేతల బృందం పరిశీలించి ఎంపిక చేసింది. 2024లో దేశంలోని నాలుగు ప్రాజెక్టులను ఎంపిక చేయగా అందులో కేసీకాలువ ఒకటి.
** ఇది కేసీకాలువ చరిత్ర
భారీ నీటిపారుదల ప్రాజెక్టుల్లో కేసీకాల్వ ఒకటి. కర్నూలు జిల్లాలో 1,73,627ఎకరాలకు, కడప జిల్లాలో 92,001ఎకరాల ఆయకట్టుకు నీరందించే ప్రధాన నీటి వనరు. అతి పురాతనమైన కాల్వ ఇది. తుంగభద్ర ఆధారంగా నిర్మించిన కేసీకాల్వ కర్నూలు జిల్లాలోని సుంకేశుల ఆనకట్ట వద్ద ప్రారంభమవుతుంది. నంద్యాల-వైఎస్సార్ కడప జిల్లాల సరిహద్దు రాజోలి గ్రామ సమీపంలో కుందునదిపై ఆనకట్ట నిర్మించారు. దీంతో రాజోలి ఆనకట్టగా పిలువబడుతోంది. ఆనకట్ట నుంచి కడప జిల్లాలోని ఆయకట్టుకు నీరు మళ్లిస్తారు. 234.64కి.మీ. వద్ద ప్రారంభమయ్యే కాల్వ 305.86కి.మీ. పయనించి కడప కృష్ణాపురం వద్ద అంతరిస్తుంది.1863లో మద్రాసు ఇరిగేషన్ కంపెనీ, కెనాల్ నిర్మాణ కంపెనీ అనే డచ్ కంపెనీలు జలరవాణా, కొద్దిపాటి నీటిపారుదల సౌకర్యంతో కాల్వ నిర్మాణం చేశారు. 1873నాటికి కాల్వ పూర్తి చేసి జలరవాణా చేపట్టగా తరచూ కాల్వకు గండ్లు పడటంతో నష్టాలు పెరిగాయి. రూ. 3.2 కోట్లతో బ్రిటిష్ ప్రభుత్వానికి విక్రయించారు. ఇంజనీర్ మెకంజ్ సూచనతో కాల్వ ద్వారా రవాణా సౌకర్యం తగ్గించి నీటిపారుల సౌకర్యానికి ప్రాధాన్యత కల్పించారు. 1906 తర్వాత అంచెలంచెలుగా ఆయకట్టును అభివృద్ధి చేశారు. నేడు పసిడి పంటలతో అలరారుతోంది. బచావత్ అవార్డు ప్రకారం కేసీకాల్వకు 39.90టీఎంసీలు నీరు కేటాయించారు. 10టీఎంసీలు తుంగభద్ర నుంచి కేటాయించగా మిగిలిన 29.90టీఎంసీలు తుంగభద్ర పరివాహక ప్రాంతం నుంచి వాడుకునేలా చేశారు. కేసీకాల్వకు తరచూ గండ్లు పడుతూ ఉండటంతో రైతులు ఎన్నో ఆటుపోట్లకు గురయ్యేవారు. సక్రమంగా పంటలు పండించుకునే పరిస్థితి లేకపోవడంతో కేసీకాల్వకు ఆధునికీకరణ అవసరమైంది. జనాన్ సంస్థ ఆర్థిక సహాయంతో 1998లో రూ. 1107కోట్లతో సిమెంట్ లైనింగ్ పనులు చేపట్టి సాగునీటి సరఫరా సక్రమంగా సాగేలా చర్యలు తీసుకున్నారు. తుంగభద్ర పరివాహక ప్రాంతంలోని వరదనీటిని సుంకేశుల ఆనకట్ట వద్ద నిల్వ చేసి అక్కడి నుంచి కేసీకాల్వకు మళ్లించే వారు. అయితే కర్నూలు జిల్లా దాటుకుని సక్రమంగా సాగునీరు అందే పరిస్థితి లేక పోవడంతో ముఖ్యమంత్రిగా ఎన్టీరామారావు కడపజిల్లా రైతాంగ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని శ్రీశైలం జలాశయం వెనుక జలాలను తీసుకునేందుకు నిర్ణయం తీసుకున్నారు. నంద్యాల జిల్లా పోతిరెడ్డిపాడు వద్ద హెడ్‌రెగ్యులేటర్‌ను నిర్మించారు. 1985 నుంచి శ్రీశైలం జలాశయం నుంచి కృష్ణాజలాలను కేసీకాల్వ ఆయకట్టుకు మళ్లిస్తున్నారు. నేడది హక్కుగా మారింది.