
అలనాటి కట్టడాలు.. నిర్మించిన కోనేరులు… శిల్ప సంపద. ఇవన్నీ ప్రాచీన చరిత్రకు సాక్ష్యాలుగా చెప్పవచ్చు. దువ్వూరు మండలం పెద్దభాకరాపురం సమీపంలో గణాద్రిస్వామి గుట్టగా పిలవబడే గుట్టలపై ఆది మానవుడు సంచరించాడని చెప్పడానికి అక్కడ కనిపించే శిలా చిత్ర లేఖనాలు సాక్షాలుగా నిలుస్తున్నాయి. కొండపై మానవుని పాదాలు, ఎడ్లు, నంది పాదం, ఆయుధం, వ్యవసాయ పనిముట్లు, జంతువులు ఇలా పలు శిల్పిన చిత్ర లేఖనాలు గణాద్రిస్వామి గుట్టపై కనిపిస్తున్నాయి. సంరక్షణ దిశగా చర్యలు కరవయ్యాయి. స్థానికులు గుట్టపై రాళ్ల కోసం చేస్తున్న తవ్వకాలతో ప్రాచీన చరిత్ర ఆనవాళ్లు తొలగిపోతున్నాయి. అమ్మతల్లి లేఖనానికి ఐరోపాలోని వల్కమోనికా సంస్కృతికి దగ్గరి సంబంధం ఉందని ఇలాంటి అమ్మతల్లి చిత్రలేఖనం మహబూబ్ నగర్ జిల్లా ముడుమాల గ్రామంలో ఉన్నట్లు పురావస్తు పరిశోధకుడు డాక్టర్ శేగినేని వెంకట శ్రీనివాసులు స్పష్టం చేశారు. పాదముద్రలు, నందిపాదాలు ప్రకాశం జిల్లా నాయుడుపల్లెలోనూ, జిల్లాలో సింహాద్రిపురం మండలం లావనూరులో ఉన్నట్లుగా పేర్కొన్నారు. గడియారపు వలయం చిత్తూరు జిల్లా చంద్రగిరి ప్రాంతంలో ఉన్నట్లు చెప్పారు. గుట్టపై లభించిన చిత్రాలను పరిశీలించడం ద్వారా ఆదిమానవుడు వేటగానిగా జీవిస్తూ పశుపోషకుడు, వ్యసాయదారుడిగా మారి నదీ పరివాహక ప్రాంతానికి చేరి నల్లరేగడి భూముల్లో వ్యవసాయం చేయడం ద్వారా గొప్ప నాగరికుడిగా మారినట్లు వివరించారు. కాంస్య యుగ దశ (కీ.పూ 2500) నుంచి తొలి చారిత్రక దశ వరకు మానవుడు గృహ స్థావరం చేసుకున్నట్లు స్పష్టం స్పష్టమవుతోందని తెలిపారు.




