గ్రామాల్లో నిర్మించే ఆలయాలు గ్రామస్థుల మధ్య బంధాలను పెంచేలా ఉండాలే కానీ గ్రామస్థుల మధ్య విభేదాలను పెంచేలా ఉండకూడదని జిల్లా కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ అన్నారు. ఎర్రగుంట్ల మండలం పోట్లదుత్తిలో పెద్దమ్మ తల్లి ఆలయానికి సంబంధించి ప్రహరీ గోడ నిర్మాణ విషయంలో ఇరువర్గాల మధ్య తలెత్తిన అభ్యంతరాలు, విభేదాల పరిష్కారం కోసం జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ తో కలిసి కలెక్టరు గ్రామం చేరుకుని ఆలయ ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామానికి బడి, గుడి అనేవి ఆ గ్రామ అభివృద్ధికి కావాల్సిన విద్యాబుద్ధులు, గ్రామస్థుల్లో చక్కటి నడవడిక, శాంతియుతమైన ప్రశాంత వాతావరణాన్ని కల్పిస్తాయన్నారు. విద్యతో పాటు వినయాన్ని, నైపుణ్యాన్ని, ఉద్యోగ ఉపాధి అవకాశాలను బడి నేర్పిస్తే.. ఆలయాలు గ్రామంలో శాంతియుత వాతావరణాన్ని, సంస్కృతి సంప్రదాయాలను, పండుగలు, ఉత్సవాలు, గ్రామస్థుల మధ్య బంధాలను, స్నేహ భావాన్ని పెంపొందిస్తాయన్నారు. ఆలయ ప్రహరీ విషయంలో వివాదాలకు తావులేని విధంగా పరిష్కారం చూపిస్తామని కలెక్టరు తెలిపారు. కార్యక్రమంలో జమ్మలమడుగు ఆర్డీవో సాయిశ్రీ, ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున, పోలీసు శాఖ, రెవెన్యూ, దేవాదాయ శాఖల అధికారులు, స్థానిక నాయకులు సురేష్ నాయుడు, రాజేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
