మహిళలు, పురుషులు సమానమని నమ్మే పార్టీ, ప్రభుత్వం.. ఎన్డీయే, తెలుగుదేశం అని, మహిళలకు పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలోని కొప్పర్తి ఇండిస్ట్రియల్ హబ్ లో ప్రముఖ రెడీమేడ్ దుస్తుల తయారీ కంపెనీ టెక్సానా మాన్యుఫాక్చరింగ్ నూతన యూనిట్ ప్రారంభం అనంతరం అక్కడ పనిచేసే మహిళా సిబ్బందితో మంత్రి నారా లోకేష్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇక్కడ ఎంతమందికి ఇది మొదటి ఉద్యోగం, రెండోది, మూడోదో చేతులు పైకి ఎత్తాలి. నా తొలి ఉద్యోగం బాగా గుర్తుంది. ఎండాకాలం సెలవుల్లో మూడు నెలలు పనిచేయాలని బాబు గారు చెప్పారు. ఇంటికి రానివ్వలేదు. అమెరికాలో జీఈ క్యాపిటల్ కంపెనీలో పనిచేశా. నా మొదటి బాస్ పేరు జాక్ అని కూడా గుర్తింది. జీవితంలో ఒకటి సాధించామని, సొంత కాళ్లపై నిలబడగలనని అప్పుడు అనిపించింది. పాదయాత్రలో 226 రోజులు పాటు 3,132 కి.మీలు నడిచా. చాలా మందిని కలిశా. ఎక్కడికి వెళ్లినా మాకు ఉద్యోగాలు కల్పించాలని అడిగారు. బాబు సూపర్ సిక్స్ లో మేం ఇచ్చిన తొలి హామీ ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన. దీపం, తల్లికివందనం, స్త్రీ శక్తి లాంటి హామీలు ఇచ్చాం. గంగాధర నెల్లూరులో నేను యువగళలం పాదయాత్ర చేస్తున్నప్పుడు ఓ తల్లిని కలిశాను. తన భర్త తాగుడుకు బానిసై చనిపోయాడని, బజ్జీ కొట్టు నడుపుకుంటూ తన ఇద్దరు కుమారులను చదివించానని చెప్పారు. తమ కుమారులకు ఉద్యోగాలు కల్పిస్తే చాలని.. ఏమీ వద్దని ఆమె చెప్పారు. కియా ఫ్యాక్టరీ వద్ద ఫోటో దిగేందుకు వెళ్తుండగా.. ఓ చెల్లి వచ్చి నన్ను కలిసింది. కియా అనుబంధ విభాగాల్లో ఉద్యోగం చేస్తున్నానని, ఇప్పుడు తనకు నెలకు రూ.40వేల జీతం వస్తోందని చెప్పారు. గతంలో గృహిణిగా ఉండగా.. ప్రస్తుతం కుటుంబాన్ని తానే పోషిస్తున్నాని చెల్లి గర్వంగా చెప్పారు. చంద్రబాబు గారికి కృతజ్ఞతలు చెప్పాలని ఆమె కోరారు.
*మహిళలు, పురుషులు సమానమని నమ్మే పార్టీ, ప్రభుత్వం ఎన్డీయే, తెలుగుదేశం*
గాజులు తొడుక్కున్నావా, చీర కట్టుకున్నావా వంటి మాటలను విడనాడాలి. మహిళలు, పురుషులు సమానమని నమ్మే పార్టీ, ప్రభుత్వం ఎన్డీయే, తెలుగుదేశం. మహిళలను గౌరవించడం ఇంట్లోనే మొదలవుతుంది. చంద్రబాబు గారు 1992లో చిత్తూరు జిల్లాలో హెరిటేజ్ ను స్థాపించారు. సదరు కంపెనీని మా తల్లి భువనేశ్వరి గారు సమర్థంగా నడిపారు. అదే కంపెనీలో బ్రాహ్మణి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పనిచేస్తన్నారు. ఇప్పుడు నేను రోడ్లపై తిరుగుతున్నానంటే కారణం నారా బ్రాహ్మణి. నా క్రెడిట్ కార్డు బిల్లును నా సతీమణి నారా బ్రాహ్మణి కడుతున్నారు. మార్పు మన ఇంట్లో మొదలవ్వాలని నేను బలంగా నమ్ముతున్నాను.
*మహిళలకు పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం*
మహిళలకు పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. మీ పిల్లలను కూడా చూసుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది. తల్లికి వందనం కూడా నా శాఖ కిందే వస్తుంది. ఉచిత బస్సులో ప్రయాణం చేసే వారు చేతులెత్తాలి. తల్లిని గౌరవించాలని చంద్రబాబు గారు చెప్తుంటారు. తల్లిని అవమానిస్తే ఎంత బాధపడతారో నేను చూశాను. శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానించారు. కోలుకునేందుకు మూడు నెలల సమయం పట్టింది. మహిళలను గౌరవించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో తల్లి కాళ్లకు నమస్కారం పెట్టే కార్యక్రమాన్ని తీసుకువచ్చాం.
*మహిళలు సొంత కాళ్లపై నిలబడాలనేది మా లక్ష్యం*
ఎక్కడైతే మహిళలను గౌరవిస్తారో ఆ సమాజం బాగుపడుతుంది. సంక్షేమంతో పాటు అభివృద్ధి చేస్తాం. ఎన్టీఆర్ దగ్గర నుంచి చంద్రబాబు వరకు మహిళల కోసం అనేక కార్యక్రమాలు చేప్టటారు. డ్వాక్రా సంఘాల ఏర్పాటు, ఆస్తిలో సమానహక్కు, మహిళలకు తిరుపతిలో ప్రత్యేక విశ్వవిద్యాలయం ఏర్పాటుచేసింది తెలుగుదేశం, ఎన్టీఆర్ గారు. మహిళలు సొంత కాళ్లపై నిలబడాలనేది మా లక్ష్యం. మిమ్మల్నందరినీ చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. 90 శాతం మందికి ఇది మొదటి ఉద్యోగం. శిక్షణ కూడా ఇచ్చారు. ఇక్కడ పని మానేయవద్దు.
*కొప్పర్తికి పరిశ్రమలు తీసుకువచ్చే బాధ్యత నాది*
ఇంకా పరిశ్రమలు తీసుకువస్తాం. ఇదే కొప్పర్తికి పరిశ్రమలు తీసుకువచ్చే బాధ్యత నాది. భరత్ గారు, నేను కలిసి కట్టుగా పనిచేసి పరిశ్రమలు తీసుకువస్తాం. 50శాతం ఎమ్మెల్యేలు మొదటిసారి గెలిచిన వారు. 25 మంది మంత్రుల్లో 17 మంది కొత్తవారు. మాలో కసి ఉంది. రాష్ట్రాన్ని నెం.1 గా చేయాలనే లక్ష్యం పెట్టుకున్నాం. మీరు మొదలుపెట్టిన ప్రయాణం ఆగకూడదు. బాగా పనిచేయాలి. లక్ష్యాన్ని నిర్దేశించుకుని అందుకోసం కష్టపడాలి. రాబోయే రోజుల్లో మెరుగైన అవకాశాలు కల్పిస్తాం. ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది. ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం.
*పరిశ్రమదారులకు అండగా ఉంటాం*
కంపెనీ యాజమాన్యానికి కూడా ఏపీ ప్రజల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీకు అన్ని విధాల అండగా ఉంటాం. ఏపీ ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరుతున్నా. ఏ సమస్య ఉన్నా మెసేజ్ దూరంలో ఉంటానని చెప్పారు. అనంతరం మహిళా సిబ్బందితో సెల్ఫీలు దిగారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, బీసీ సంక్షేమ, చేనేత జౌళ్ల శాఖ మంత్రి ఎస్.సవిత, కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి, సీనియర్ నేత పుత్తా నరసింహారెడ్డి, కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
