జిల్లాలో సామాజిక రుగ్మతలను సమూలంగా తొలగించడమే లక్ష్యంగా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పారదర్శకంగా, నిబద్ధతతో విధులు నిర్వర్తించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్, జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ సంయుక్తంగా పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్ లోని బోర్డు మీటింగ్ హాలులో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. జేసీ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీకి సంబంధించిన కేసులలో బాధితులకు న్యాయంతో పాటు త్వరితగతిన పరిహారం అందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతోందన్నారు. వారికి సంబంధించిన భూ సమస్యలు ఏమైనా ఉంటే వాటిపై ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. బాధితులకు పరిష్కారం అందించడం ఒక ఎత్తు అయితే భవిష్యత్తులో అట్రాసిటీ కేసులు నమోదు కాకుండా చర్యలు తీసుకోవాలని ఆ దిశగా ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు. దళితుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని, ఎక్కడ వారు అన్యాయానికి గురి కాకుండా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు చూడాలన్నారు. సామాజిక రుగ్మతలను దూరం చేసి అన్ని వర్గాల ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేలా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ చేపడుతున్న చర్యలపై అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. సమాజంలో నేరాలను తగ్గించేలా చర్యలు తీసుకోవడంతోపాటు, అట్రాసిటీ చర్యలకు పాల్పడితే విధించే శిక్ష, కేసులు, సెక్షన్ల వంటి అంశాలపై అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సాంఘిక సంక్షేమ హాస్టళ్లపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అలాగే పోక్సో చట్టం, బాల్య వివాహాలు నిరోధక చట్టం పైన ప్రజల్లో అవగాహన సదస్సులు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని పోలీసు, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు బాల్య వివాహాలను అరికట్టే చర్యల్లో విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రెవెన్యూ డివిజన్ల వారీగా ఆర్డీవోలు, డిఎస్పీలు మండల స్థాయి అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసి.. ప్రజల్లో విస్తృత అవగాహన పెంచాలన్నారు. కార్యక్రమంలో కడప, జమ్మలమడుగు, పులివెందుల డివిజన్ల ఆర్డీవోలు జాన్ ఇర్విన్, సాయిశ్రీ, చిన్నయ్య, డిఎస్పీలు వెంకటేశ్వర్లు (కడప), భావన (ప్రొద్దుటూరు), మురళి (పులివెందుల), రాజేంద్ర ప్రసాద్ (మైదుకూరు), ఎస్పీ కార్పొరేషన్ ఈడి & డీఆర్డీఏ పిడి రాజ్యలక్ష్మి, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు బాలాజీ, శ్యాం సుందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
