
వైఎస్సార్ కడప జిల్లా వల్లూరు మండలంలోని పుష్పగిరి క్షేత్రం వద్ద కాకతీయుల కాలం నాటి పుష్పాచలేశ్వర ఆలయం ఉంది. దుర్గాదేవి ఆలయానికి ఈశాన్యంలో కొండపై వందల ఏళ్ల కిందట నిర్మించిన ఆలయం ఉన్నట్లు రచయిత, చరిత్రకారుడు తవ్వా ఓబులరెడ్డి తెలిపారు. నడిగట్టు ఆలయంగా పూర్వం పూజలు చేసేవారు. కాకతీయుల వాస్తు నిర్మాణ శైలిలో నిర్మించిన ఆలయం హరిహర క్షేత్రంగా వెలుగొందింది. ఆలయంలో ఉమామహేశ్వరుడు, లక్ష్మీనారాయణ స్వామి, సుబ్రహ్మణ్యుడు, విఘ్నేశ్వరుడి విగ్రహాలను ప్రతిష్ఠించినట్లు మెకంజీ అధ్యయనం చెబుతోంది. 12వ శతాబ్దానికి చెందిన రాజు తన ముగ్గురు భార్యలతో కలిసి ఆలయంలో పూజలు చేసినట్లు ఇక్కడి శిలాఫలకంలో ఉన్నట్లుగా ప్రముఖ చరిత్రకారుడు ఈమని శివ నాగిరెడ్డి అభిప్రాయపడ్డారని ఓబులరెడ్డి స్పష్టం చేశారు.