
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆగస్టు 1న జమ్మలమడుగు మండలంలో పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై సోమవారం జమ్మలమడుగు మండలంలోని పలు ప్రాంతాలను రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే సి.ఆదినారాయణ రెడ్డి, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తో కలిసి జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ పరిశీలించారు. హెలిప్యాడ్ ఏర్పాటుకు ముద్దనూరు రోడ్డులోని అంబవరం పంచాయతీ పరిధి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల పక్కనున్న ఖాళీ ప్రాంతాన్ని పరిశీలించారు. హెలిప్యాడ్ ఏర్పాటుకు అవసరమైన అన్ని రకాల భద్రత అంశాలపై జిల్లా ఎస్పీ, రెవెన్యూ, ఇంజినీరింగ్ అధికారులతో కలెక్టర్ చర్చించారు. ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాటుకు గూడెం చెరువు గ్రామంలో టిడ్కో కాలనీ ఎదురుగా ఉన్న ఖాళీ మైదానాన్ని పరిశీలించారు. గండికోట పర్యాటక క్షేత్రం వద్ద హెలిప్యాడ్ స్థలాన్ని, గండికోట గార్జ్, వ్యూ పాయింట్, కోట పరిసరాలను పరిశీలించారు. పరిశీలనలో జమ్మలమడుగు, బద్వేలు, పులివెందుల ఆర్టీవోలు సాయిశ్రీ, చంద్రమోహన్, చిన్నయ్య, తహసీల్దార్ శ్రీనివాసులు రెడ్డి, స్థానిక యువ నాయకులు భూపేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.