జిల్లాల పునర్విభజన తరువాత మొదటిసారి రాజంపేట నియోజకవర్గ పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ నందలూరు శ్రీ సౌమ్యనాథస్వామి దేవాలయాన్ని సందర్శించారు. ఆలయంలో దర్శనం, ప్రత్యేక అర్చనలు చేశారు. ఆలయ ప్రధానార్చకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం రాజంపేట సబ్ కలెక్టర్ కార్యాలయ పరిశీలనకు వచ్చిన కలెక్టరు రాజంపేట సబ్ కలెక్టర్ భావన పూల మొక్క అందజేసి స్వాగతం పలికారు. సమావేశ మందిరంలో రాజంపేట రెవిన్యూ డివిజన్ పరిధిలోని మండల తహసీల్దార్లతో సమావేశమయ్యారు. రెవెన్యూ డివిజన్ వ్యాప్తంగా రాజంపేట, నందలూరు, టి.సుండుపల్లె, వీరబల్లి మండలాల్లో రెవెన్యూ, అభివృద్ధి అంశాలపై కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. రెవెన్యూ, భూ సమస్యలు, లీగల్ సంబంధిత అంశాలు, ప్రభుత్వ ఆస్తులు, ప్రభుత్వ భూముల పరిరక్షణలో మండల తహసీల్దార్లు పారదర్శకంగా, సమర్థవంతంగా వ్యవహరించాలని, పీజీఆర్ఎస్ ద్వారా అందిన ఫిర్యాదులు త్వరితగతిన నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలని కలెక్టర్ సూచించారు. రెవెన్యూ డివిజన్ పరిధిలోని గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యలు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు.
