జిల్లాలో ప్రధాన ఉపాధి వనరుల ఖిల్లాగా కొప్పర్తి ఏపీఐఐసీ మెగా ఇండస్ట్రియల్ హబ్ వెలుగొందుతోందని ఉద్యోగ ఉపాధి అవకాశాలకు కొరత లేదని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అన్నారు. కొప్పర్తి లో దాదాపు 600 ఎకరాల్లో ఏర్పాటైన మెగా ఇండస్ట్రియల్ హబ్ లో ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ను జిల్లా కలెక్టర్, కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి, జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ కలిసి పరిశీలించారు.
సెప్టెంబర్ 2న రాష్ట్ర విద్యాశాఖ, ఐటి శాఖామంత్రి జిల్లాలో పర్యటించనున్న సందర్భంగా కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్కులో నూతనంగా నిర్మించిన ఎగ్జిక్యూటివ్ గెస్ట్ హౌస్, నూతనంగా ఏర్పాటైన “టెక్నో డోమ్ ఇండియా ప్రయివేటు లిమిటెడ్”, రెడీమేడ్ సూట్స్ తయారు చేసే “టెక్సానా ఇండియా ప్రయివేటు లిమిటెడ్” పరిశ్రమల్లో ఉత్పత్తిని మంత్రిచే ప్రారంభోత్సవం చేయించే యోచనలో భాగంగా జిల్లా యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. అధునాతన సదుపాయాలతో నిర్మితమైన ఎగ్జిక్యూటివ్ గెస్ట్ హౌస్ తోపాటు ఆయా పరిశ్రమల యూనిట్లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. మంత్రిచే ప్రారంభోత్సవం చేయడానికి తగిన ఏర్పాట్లపై ఎమ్మెల్యేతో కలిసి సంబందిత అధికారులకు సూచనలు ఇచ్చారు. అంతేకాకుండా అక్కడ అవసరమైన భద్రతా ఏర్పాట్లపై జిల్లా ఎస్పీతో చర్చించారు.
జిల్లాలో పరిశ్రమల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఆ దిశగా కొప్పర్తి పారిశ్రామిక వాడను.. రాష్ట్రంలోనే మోడల్ ఇండస్ట్రియల్ పార్కుగా తీర్చిదిద్దేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తోందన్నారు. అందులో భాగంగానే కొప్పర్తి పారిశ్రామిక వాడలో జిల్లాకే తలమానికంగా “ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ (ఈఎంసీ)” క్లస్టర్ లో పరిశ్రమలు రూపు దిద్దుకుంటున్నాయన్నారు. ఎన్నో ప్రతిష్ఠాత్మకమైన కంపెనీలు కొప్పర్తి పారిశ్రామిక వాడలో రూపుదిద్దుకుంటున్నాయని దీంతో జిల్లా యువతకు భారీగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు, కాంట్రాక్టర్లకు, పెట్టుబడిదారులకు మంచి అవకాశాలు పెరగనున్నాయని.. భవిష్యత్తులో జిల్లా పారిశ్రామికంగా మరింత అభివృద్ధిలోకి రానుందని తెలిపారు. కార్యక్రమంలో కడప ఆర్డీవో జాన్ ఇర్విన్, ఏపి ఐఐసీ జోనల్ మేనేజర్ శ్రీనివాస మూర్తి, ఇండస్ట్రిస్ జీఎం చాంద్ బాషా, సికే దిన్నె తహసీల్దార్ నాగేశ్వరరావు, సంబందిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
