
రాష్ట్ర ప్రభుత్వం SC, ST విద్యుత్ వినియోగదారులకు నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పొందాలంటే విధిగా ప్రతి నెలా 200 యూనిట్ల లోపు వినియోగం ఉంటేనే వర్తిస్తుందని వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరు సబ్ డివిజన్ అధికారి శ్రీకాంత్ తెలిపారు. ఈవిషయాన్ని ఎస్సీ, ఎస్టీ వినియోగదారులు గమనించాలని సూచించారు. 200 యూనిట్లు మించితే ఉచిత విద్యుత్తు వర్తించదని, మొత్తం బిల్లును వినియోగదారుడే భరించాలని పేర్కొన్నారు. ఉచిత విద్యుత్ పథకంపై అవగాహన కల్పిస్తున్నా ఎక్కువ శాతం SC, ST లు విద్యుత్ వినియోగంలో నియంత్రణ లేకుండా వినియోగిస్తున్నారని వెల్లడించారు. ఉచిత విద్యుత్తు నిబంధన తెలియక పోవడంతో ఎస్సీ, ఎస్టీ వినియోగదారులు బిల్లుల వసూలుకు గ్రామాలకు వెళ్లే సిబ్బందితో గొడవపడటం.. విధులకు ఆటంకం కలిగించటం…అక్కడక్కడా బెదిరింపులకు పాల్పడటం చేస్తున్నారని ఇది సరైంది కాదన్నారు. ఉచిత విద్యుత్తు పొందాలనుకునే ఎస్సీ, ఎస్టీ వినియోగదారులు నిబంధన తెలుసుకుని ఉచిత విద్యుత్తు పొందాలన్నారు.