
ఓరుగల్లు రాజధానిగా చేసుకుని పరిపాలించిన కాకతీయ గణపతిదేవుని కాలంనాటి శిలా విగ్రహం (వీరగల్లు) ఒకటి దువ్వూరు మండలం రాంసాయినగర్ సమీపంలో గుర్తించారు. రాంసాయినగర్ దక్షిణ దిశలో మూడిండ్లపల్లె గ్రామానికి చెందిన మంచాల సుబ్బిరెడ్డి పొలంలో విగ్రహం బయటపడిన విషయం తెలుసుకున్న పురావస్తు శాస్త్రవేత్త శేగినేని వెంకట శ్రీనివాసులు ఆయన శిష్యుడు రంగస్వామిలు పరిశీలించారు. శేగినేని వెంకట శ్రీనివాసులు భాస్కర్ పీడియాతో మాట్లాడుతూ గణపతిదేవుని కుమార్తె రాణిరుద్రమదేవి యుద్ధ విజేతగా అశ్వంపై వెళ్తున్నట్లుగా ఉందని, వాటివెనుకే రాజలాంఛనం వరాహం, మరొక అశ్వం దాని పక్కనే యుద్ధవీరుడు ఉన్నారని, పక్కనే గుట్టపై బృహత్ శిలాయుగపు పల్లకి వంటి చిత్రలేఖనాలు ఉన్నట్లు తెలిపారు. కాకతీయుల కాలంలో నేటి దువ్వూరు నాడు దుర్వాసపురం తాలూకా ఉందని, అప్పట్లో రాంసాయినగర్ సమీప ప్రాంతం బోయపల్లె గ్రామంగా ఉందనడానికి సాక్ష్యాలుగా నేటికి అక్కడ మంచినీటి బావితోపాటు వీరభద్రస్వామి, చాముండేశ్వరి, గణపతి, కుమారస్వామి విగ్రహాలు పూజలు అందుకుంటున్నట్లు తెలిపారు.