
వైఎస్సార్ కాంగ్రెస్ నిర్లక్షం చేసినా వైఎస్సార్ కడపజిల్లా దువ్వూరు మండలం జొన్నవరం వద్ద కుందూనది పై ఎత్తిపోతల పథకం ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం ముందుకు వచ్చింది. రూ.780కోట్లు నిధుల విడుదలకు అంగీకారం తెలిపింది. త్వరలో ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేయనున్నట్లు శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్ తెలిపారు. ఎగువన వర్షాలు అనుకూలించక కృష్ణానది పరుగులు తీయక పోయినా కర్నూలు, నంద్యాల జిల్లాలో కురిసే వర్షాలతో కుందూనదిలోకి చేరే నీటిని ఒడిసిపట్టి తెలుగుగంగ కాలువలోకి ఎత్తిపోసేలా ఎత్తిపోతల పథకం ఏర్పాటుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ రూ.564కోట్లు మంజూరు చేసింది. 2019 డిసెంబరు 23న దువ్వూరు మండం నేలటూరు వద్ద అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి శంకుస్థాపన చేసినా పనులు మొదలు కాలేదు. జొన్నవరం వద్ద ఏర్పాటు చేసే ఎత్తిపోతల పథకం ద్వారా 8టీఎంసీల నీటిని తెలుగుగంగ కాలువలోకి ఎత్తిపోయనునానరు. సబ్సిడరీ రిజర్వాయర్-1 మీదుగా బ్రహ్మంగారిమఠం వద్ద ఉన్న బ్రహ్మంసాగర్ జలాశయానికి నీరు నింపనున్నారు. ఎత్తిపోతల పథకం నిర్మాణానికి వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో శంకుస్థాపన చేసినా పనులు చేపట్టక పోవడంతో ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ జొన్నవరం వద్ద ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేయాలనే సంకల్పంతో కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి నిధులు మంజూరు చేయించారు. దీనివల్ల బ్రహ్మంసాగర్ కింద ఆయకట్టుకు నీరు మైదుకూరు, బద్వేలు పురపాలిక వాసులకు తాగునీటి ఇబ్బందులు తొలగిపోనున్నాయి.