
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ అధికారులను ఆదేశించారు. జమ్మలమడుగు ఆర్డీవో కార్యాలయ సమావేశ మందిరంలో ముఖ్యమంత్రి జిల్లా పర్యటన ముందస్తు ఏర్పాట్లపై కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వ విప్, జమ్మలమడుగు శాసన సభ్యులు సి.ఆదినారాయణ రెడ్డి, జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్, డీఆర్వో విశ్వేశ్వర నాయుడుతో కలిసి సమావేశం నిర్వహించారు.
ఆగస్టు 1న ముఖ్యమంత్రి జమ్మలమడుగు మండలంలోని గూడెం చెరువు గ్రామంలో పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేస్తారన్నారు. పెన్షన్ దారుల కుటుంబ ఆర్థిక స్థితిగతులపై ఇంటరాక్షన్ ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి పాల్గొనే అన్ని కార్యక్రమాలకు అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు పాటించేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయడానికి జిల్లా అధికారులకు కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలన్నారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా ప్రణాళికకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల 31 వ తేదీ సాయంత్రం నాటికి ముఖ్య మంత్రి పర్యటన కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలనన్నారు. విధులు కేటాయించిన అధికారులందరూ ప్రోటోకాల్ నిబంధనలను పాటించాలన్నారు.
ముఖ్యమంత్రి పాల్గొనే ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా వుండాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. భద్రత, పార్కింగ్ అంశాలలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తుగా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ప్రధానంగా విద్యుత్, రహదారులు, ట్రాఫిక్ నియంత్రణ, పారిశుధ్యం, ఏర్పాట్లతో పాటు పోలీసు, ఫైర్, ఏమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ ను కూడా అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో.. జమ్మలమడుగు, బద్వేలు, పులివెందుల ఆర్డీఓ లు సాయి శ్రీ, చంద్రమోహన్,చిన్నయ్య, మెప్మా,డీఆర్డీఏ, డ్వామా పీడీలు కిరణ్ కుమార్, రాజ్యలక్ష్మి, అదిశేషారెడ్డి, ఎస్డీసీ లు వెంకటపతి, రంగస్వామి, డిఎంహెచ్ఓ డా.నాగరాజు, జెడ్పీ సీఈవో ఓబులమ్మ, పోలీసు, ఫైర్, విద్యుత్, ఆర్ అండ్ బి, పీఆర్ వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.