విశ్వహిందూ పరిషత్, కడప అయోధ్య ఐక్యవేదిక ఆధ్వర్యంలో కడపలో నిర్వహిస్తున్న సీతారామ కళ్యాణం, శ్రీరామ మహా శోభాయాత్రను శాంతియుతంగా నిర్వహించి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ శాఖల అధికారులను ఆదేశించారు. ఈనెల 21న సీతారాముల కల్యాణోత్సవం, 22న శ్రీరామ మహా శోభాయాత్ర నిర్వహణ, శాంతి భద్రతలపై కడప ఎమ్మెల్యే ఆర్. మాధవి రెడ్డి, అధికారులు, ఉత్సవ కమిటీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాయలసీమలోనే అంతంత ప్రతిష్టాత్మకంగా 22న నిర్వహించే శ్రీరామ మహా శోభాయాత్ర కార్యక్రమాన్ని కుల మతాలకు అతీతంగా మాత సామరస్యానికి ప్రతీకగా శాంతియుత వాతావరణంలో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని రకాల భద్రతా ఏర్పాట్లను, కనీస సదుపాయాలను కల్పించడం జరుగుతుందని తెలిపారు. శాఖల అధికారులు ఏర్పాట్లను నిర్ణీత సమయం నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. మహా శోభాయాత్ర నిర్వహించే అన్ని ప్రాంతాల్లో, సెన్సిటీవ్ ఏరియాల్లో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామని, ఆయా ప్రాంతాల్లో శాంతి కమిటి సమావేశాలు నిర్వహించి మహా శోభాయాత్రను విజయవంతం చేయాలని ఆదేశించారు. వేలాది మంది భక్తులు ఈ శోభాయాత్ర లో పాల్గొంటారని, అత్యధిక జనాలకు సరిపడా తాగునీరు, తాత్కాలిక మరుగుదొడ్ల ఏర్పాటు వంటి సదుపాయలను కడప నగరపాలక సంస్థ ఏర్పాటు చేయాలని సూచించారు. ఉత్సవ శోభాయాత్రలో అతి జాగ్రత్తగా బాణసంచాలు కాల్చేలే చర్యలు తీసుకోవాలన్నారు. కడప నగరానికి అత్యంత శోభనిచ్చే ఉత్సవం కావడంతో.. ప్రతి ఒక్కరు మన స్థానిక ఉత్సవంగా భావించి, కులమతాలకు అతీతంగా శాంతియుతంగా, రాజకీయాలకు అతీతంగా, ఆనందదాయకంగా, భక్తి భావంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కమిటీ సభ్యులను జిల్లా కలెక్టర్ కోరారు. ఉత్సవాలకు హాజరయ్యే భక్తులకు కావాల్సిన అన్ని రకాల మౌలిక, కనీస వసతులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా పూర్తి చేయాలన్నారు. భద్రతా ఏర్పాట్లు, శానిటేషన్, తాత్కాలిక మరుగుదొడ్ల ఏర్పాటు, తాగునీరు, భక్తులకు అన్నప్రసాదాలు, విద్యుత్ సరఫరా, ట్రాఫిక్ కంట్రోల్, సీసీ కెమెరాలు, విద్యుత్, అగ్నిమాపక వాహనాలు, 108 వాహనాలు, అత్యవసర మందులు, వైద్య ఆరోగ్య సిబ్బంది, తాత్కాలిక మెడికల్ క్యాంపులు, అక్కడక్కడ హెల్ప్ డెస్క్ ల ఏర్పాటు మొదలైన అన్ని అంశాలను ఎలాంటి కొరత లేకుండా.. ఏర్పాటు చేయాలని సంబందిత అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ విప్ మాధవి రెడ్డి మాట్లాడుతూ కళ్యాణోత్సవానికి హాజరయ్యే భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా ప్రత్యేక విద్యుత్ దీప అలంకరణతో ఆర్చిలు ఏర్పాటు చేయాలని కోరారు. శ్రీరామ శోభయాత్ర శ్రీరామ, హనుమంతుని భక్తితో కూడిన కడప గడపలో భజన బృందాలు, కోలాట కోలాహలం, బజరంగి విన్యాసాలు, కేరళ వాయిద్యం, రాజస్థానీ యువకుల డబ్బు దరువులు వంటి ఎన్నో సాంస్కృతి కార్యక్రమాలతో సాగుతుందని.. అందుకోసం విద్యుత్ దీపాలంకరణ తో పాటు.. అత్యంత పటిష్ట చర్యలను కూడా పాటించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో
డిఎస్పీ వెంకటేశ్వర్లు, కడప మున్సిపల్ కమిషనర్ మనోజ్ రెడ్డి, ఆర్డీవో జాన్ ఇర్విన్, స్థానిక నాయకులు శ్రీనివాసులు రెడ్డి, వీహెచ్ పి జిల్లా అధ్యక్షులు నందారపు చెన్నకృష్ణారెడ్డి, జిల్లా ఫైర్ అధికారి ధర్మారావు, డిఎంహెచ్ఓ డా.నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
