ఉల్లి రైతులకు నష్టం వాటిల్లకుండా మార్కెటింగ్ చేపట్టేందుకు అవసరమైన చర్యలను చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో జేసీ అదితి సింగ్ తో కలిసి ప్రభుత్వం చేపడుతున్న ఉల్లి పంట కొనుగోలుకు సంబంధించి జిల్లాలోని ఉల్లి ట్రేడర్లతో సమావేశం ఏర్పాటు చేసి, ఉల్లి కొనుగోలుపై సలహాలు సూచనలు ఇచ్చారు. కలెక్టర్ మాట్లాడుతూ నష్టాల్లో ఉన్న రైతుల నుంచి అధిక లాభాలను ఆశించరాదని ట్రేడర్లకు సూచించారు. నష్టాల బాటలో ఉన్న రైతులకు ట్రేడర్లు ఆర్థికంగా అండగా ఉండాలే కానీ అధిక డిమాండ్ చేయకూడదని ఆదేశించారు. రైతులు, వ్యాపారులు ప్రభుత్వంతో సమన్వయంగా మార్కెటింగ్ చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లాలో ఉల్లి నిల్వకు అవసరమైన మౌళిక సదుపాయాల కల్పనకు ప్రతిపాదనలు అందించాలని మార్క్ ఫెడ్ అధికారులను ఆదేశించారు. ఉల్లి రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా, నాణ్యతను పరిగణలోకి తీసుకుని ఈ కొనుగోలు ప్రక్రియను ప్రణాళికాబద్ధంగా, పకడ్భందీగా నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి రవిచంద్ర బాబు, జిల్లా మార్క్ ఫెడ్ అధికారి పరిమళ జ్యోతి, మార్కెటింగ్ ఎడి ఆజాద్ వలి, ఉల్లి ట్రేడర్లు తదితరులు పాల్గొన్నారు.
