సాస్కి పథకంతో గండికోట పర్యాటక కేంద్రానికి ప్రపంచ స్థాయిలో కీర్తిని ప్రతిబింబించేలా మాస్టర్ ప్లాన్ రూపొందించి అభివృద్ధి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్ లోని బోర్డు మీటింగ్ హాలులో గండికోట పర్యాటక అభివృద్ధి పనులపై డీఆర్వో విశ్వేశ్వర నాయుడు, జిల్లా పర్యాటక శాఖ, ఏపీటీడీసీ అధికారులు, కాంట్రాక్టు ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గండికోట ప్రాంతాన్ని పర్యాటక హబ్ గా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రాల్లో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కోసం ప్రత్యేక సహకారం (SASCI) అందించే పథకంతో గండికోట పర్యాటక కేంద్రంలో సుసంపన్నమైన కోట, గార్జ్ అనుభవాన్ని పర్యాటకుల సొంతం చేసే దిశగా జిల్లా యంత్రాంగం పర్యాటక శాఖ ద్వారా అభివృద్ధి పనులకు నాంది పలికినట్లు వెల్లడించారు. జనవరి నెలలో గండికోట ఉత్సవాల నిర్వహణకు మునుపే పూర్తికావాల్సిన ఎంట్రన్స్, వెలివేషన్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఏపీటీడీసీ ఇంజనీర్లు, ప్రాజెక్ట్ కన్సల్టెంట్ లను ఆదేశించారు. ఈ సందర్భంగా గండికోట పర్యాటక కేంద్రం అభివృద్ధి పథకంలో భాగంగా చేపట్టే అన్ని రకాల పనులకు సంబంధించి మ్యాపులను, డిజైన్లను పరిశీలించి పలు సూచనలు, సలహాలు అందించారు. పనుల నాణ్యతతో ఎలాంటి రాజీ లేకుండా అన్ని రకాల పర్యటన ప్రాజెక్టులను చేపట్టాలని ఆదేశించారు. అత్యంత ప్రాధాన్యతో నిర్వహిస్తున్న అభివృద్ది పనులపై ప్రతివారం పనుల పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహిస్తామన్నారు. ఏపీ టూరిజం కార్పోరేషన్ తో ఏపీలో అమలు చేస్తున్న టూరిజం పాలసీలో భాగంగా పర్యాటక ప్రాజెక్టులకు పారిశ్రామిక హోదా కల్పిస్తున్నామన్నారు. గండికోట ప్రాంతాన్ని సాస్కీ పథకం ద్వారా రూ.79 కోట్లతో అభివృద్ధి చేసి అద్భుతమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించడం జరిగిందన్నారు. అందులో భాగంగానే పర్యాటకులు బస చేసేలా స్టార్ హోటళ్లు, ఇతర ఆకర్షణీయమైన నిర్మాణాలు చేపట్టడం జరుగుతోందన్నారు. టూరిస్టులను ఆకర్షించేలా గండికోట వద్ద వ్యూపాయింట్ తో పాటు, చారిత్రక వైభవాన్ని ప్రతిబింబించేలా శ్రీకృష్ణ దేవరాయలు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. గార్జ్ పరిసరాల్లో ఎకో ఫ్రెండ్లీ టెంట్ సిటీ, బోటింగ్ తో పాటు కోట వద్ద లైటింగ్ తదితర మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామన్నారు. ఈ ప్రాజెక్టు సందర్శించిన వారికి మంచి అనుభూతి కలిగేలా రోప్ వే, గ్లాస్ బాటమ్ వాక్ వే, లైట్ అండ్ సౌండ్ షోలను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ఈ ఏడాది చివరి కల్లా టెంట్ సిటీని కూడా ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. గ్రాండ్ కాన్యన్ ను ఆకాశం నుంచి వీక్షించేందుకు హెలిరైడ్స్ సదుపాయం కూడా కల్పించనున్నట్లు తెలిపారు. హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై తదితర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు కారావాన్ టూరిజం సర్వీసులు కూడా అందుబాటులోకి రానున్నాయన్నారు. కార్యక్రమంలో జిల్లా టూరిజం అధికారి సురేష్ కుమార్, ఆర్.డబ్ల్యూ.ఎస్. ఎస్ఈ ఏడుకొండలు, ఏపీటీడీసీ నుంచి ఎగ్జుక్యూటివ్ ఇంజనీర్ సుబ్రహ్మణ్యం రాజు, డిప్యూటీ ఎగ్జుక్యూటివ్ ఇంజనీర్ పెంచలయ్య, కన్సల్టెంట్లు సాజిత్ షేక్, సుమన్ దాస్, విజయ్ కుమార్ బండి, కాంట్రాక్ట్ ప్రతినిధి శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
