మహిళల భద్రత, సాధికారతకు కేంద్ర ప్రభుత్వం మిషన్ శక్తి కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అన్నారు. కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో మిషన్ శక్తి కార్యక్రమం అమలుపై జిల్లా స్థాయి మిషన్ శక్తి కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మిషన్ శక్తిలో ‘సంబల్’ మరియు ‘సమర్థ్య’ ఉప పథకాలను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినట్లు వెల్లడించారు. “సంబల్” పథకం మహిళల భద్రతకు, “సమర్థ్య” పథకం మహిళల సాధికారత కోసం ఏర్పాటు చేసిందన్నారు. వన్ స్టాప్ సెంటర్లు (OSC) ద్వారా చట్టపరమైన కౌన్సెలింగ్, మానసిక-సామాజిక కౌన్సెలింగ్‌లు అందించాలని అలాగే చైల్డ్ మ్యారేజ్ నిర్మూలనకు అవగాహన కల్పించాలన్నారు. సమర్థ్య పథకంలో భాగంగా బాధిత మహిళలకు పునరావసం కల్పించే శక్తి సదన్ లు కడపలో 3 మైదుకూరులో 1 పనిచేస్తున్నాయని తెలిపారు. జిల్లాలో శక్తి సదన్లను బలోపేతం చేసి మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి నైపుణ్య శిక్షణలు, ఉపాధికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
బాలికల రక్షణ, విద్య, లింగ నిర్ధారణను నివారించేందుకే ‘బేటీ బచావో.. బేటీ పడావో’ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు తెలిపారు. బాలికల దశ నుంచి సంరక్షణ కల్పించేందుకు ఐసీడీఎస్, ఆరోగ్య, విద్యా శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. ‘మిషన్ శక్తి’ లో భాగంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన పథకం కింద మొదటిసారి ప్రసవానికి 5వేలు రూపాయలు, రెండవ ప్రసవంలో ఆడపిల్ల జన్మిస్తే 6వేలు రూపాయలు అందిస్తోందని తెలిపారు. మహిళల పరిరక్షణకు 181 ఉమెన్ హెల్ప్ లైన్ వినియోగించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, దేవాలయాలు, రైల్వే స్టేషన్, హాస్పిటల్స్ లలో మదర్ బ్రెస్ట్ ఫీడింగ్ రూమ్స్ ను ఏర్పాటు చేయాలన్నారు. మహిళలు, పిల్లల సమస్యలను తెలుసుకోవడానికి కార్యాలయాలు, పాఠశాలల్లో సి బాక్సులను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు మహిళా సాధికారిత అధికారి పి రమాదేవి, సోషల్ వెల్ఫేర్ డిడి సరస్వతి, డీఈవో శంషుద్దీన్, స్టెప్ సీఈవో సాయి గ్రేస్, సీపీవో హాజరత్తయ తదితరులు పాల్గొన్నారు.
