
క్రీస్తు శకం 1356 లో అప్పటి విజయనగర చక్రవర్తి సంగమ బుక్క రాయలు ఒంటిమిట్టలో కోదండ రామాలయాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. అప్పటికి గర్భాలయం అంతరాలయం మాత్రమే ఉండేవి. ఆలయంపైన చిన్న విమాన గోపురం ఉండేది.
ఆ తరువాత ఆలయానికి రెండు మూడు దశల్లో నిర్మాణాలు జరిగాయి. ఆలయ నిర్మాణంలో ఉపయోగించిన శిలలను పరిశీలిస్తే ఈ సంగతి తెలుస్తుంది. అంతరాళ భవనం తరువాత ముఖ మంటపం నిర్మించారు. ఇందుకోసం ఉపయోగించిన శిలలు ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఈ ముఖ మంటపం నిర్మించినవారు ఎవరో ఆధారం దొరకలేదు.
తరువాతి నిర్మాణాలు విజయనగరాన్ని సదాశివ రాయలు పాలిస్తున్న కాలం నుంచి మొదలయ్యాయి. ఒంటిమిట్ట ఆలయం గాలి గోపురం లోపలి వైపున ఉన్న రెండుశాసనాల్లో ఇది ఒకటి. ఈ శాసనం క్రీస్తుశకం 1558 నాటిది. కాళయుక్తి నామ సంవత్సరం ఆషాఢ శుద్ధ ద్వాదశి సోమవారం నాడు ప్రకటించారు. ఆరవీటి రామరాయల మనుమడు గుత్తి ఎర్ర తిరుమల నాయుడు అల్లుడు మాండ్రాజు నాగరాజు సిద్ధవటాన్ని పాలించాడు. సదాశివ రాయల ఆనతితో నాగరాజు ఆలయం కోసం ఒంటిమిట్ట గ్రామాన్ని ఒంటిమిట్టకు నాలుగు దిక్కులా ఉండే పల్లెల్ని సమర్పించాడు. మరో శాసనం గంగ పేరూరు తూర్పుగా ఊరి వెలుపల నిలువుగా పాతిఉంది. ఈ శాసనం కైఫియత్తులో నమోదయింది. మరుసటి సంవత్సరం అంటే సిద్ధార్థ నామ సంవత్సరం (క్రీస్తుశకం 1559) ఆషాఢ శుద్ధ ద్వాదశి నాడే నాగరాజు గారు సదాశివ రాయలవారి ఆనతితో ఈ శాసనం వేశారు. ఈ శాసనంలో గంగ పేరూరు గ్రామం ఆ గ్రామానికి తక్కిన గ్రామాలకు చెందిన రాబడి ఆలయానికి చెందుతుంది.
పై రెండు శాసనాల వల్ల లభించే ఆదాయాన్ని ఒంటిమిట్ట ఆలయానికి ఖర్చు చేయాలి. అది 1. నిత్య కట్టడికి 2. అమృత పళ్ళకు 3. అంగరంగ వైభవాలకు 4. గోపురప్రాకారాలకు. 5 తేరు తిరునాళ్ల మహోత్సవాలకు ఈ శాసనాల్లోని నాలుగో అంశం గోపుర ప్రాకారాల నిర్మాణాలు. ఈ రెండు శాసనాల ప్రకారం ఆలయం నిత్య వైభవంగా సాగాలని ఆలయం మరింత విస్తృతంగా నిర్మాణం కావాలని సదాశివ రాయలు ఆశించాడు. ఆ ప్రకారం సదాశివ రాయల ఆనతిని సిద్ధవటాన్ని పాలించిన మాండ్రాజు నాగరాజు పాటించాడు. క్రీస్తుశకం 1558 నుంచి పనులు ప్రారంభమై ఉంటాయి.
మాండ్రాజు నాగరాజుగారి తరువాత చరిత్ర తెలిసినంత వరకూ సిద్దవటం పాలకుడుగా కొండ్రాజు తిరుపతి రాజు వచ్చాడు. ఈయన ఊటుకూరు యుద్ధం(1597-98)లో చనిపోయాడు. అప్పటినుండి సిద్ధవటానికి మట్లవారి అమరనాయకత్వం వచ్చింది. మట్ల ఎల్లమరాజు ఆయన కుమారుడు అనంతరాజు ఆయన కుమారుడు తిరు వెంగళనాథ రాజు ఆయన కుమారుడు కుమార అనంతరాజు సిద్ధవటాన్ని పాలించారు. అనంతరాజు కాలానికి దాదాపు ఒంటిమిట్ట ఆలయ నిర్మాణాలు పూర్తి అయ్యాయి. ఈ ఆలయానికి మహాప్రాకారం మూడు గాలిగోపురాలు లోపల కళ్యాణ మండపం వంటశాల ఎదుర్కోలు మంటపాలు నిర్మాణం అయ్యాయి. రంగమంటపం సందర్శకులకు ఆశ్చర్యం కలిగేటట్లు తయారయింది. ఆలయానికి కొంచెం దూరంగా ఎనిమిది దిక్కుల బలి మండపాలు ఏర్పాటయ్యాయి. గొప్ప తేరు తయారయింది. ఆలయ ప్రాకారం వెలుపల యాత్రికులు బస చేసేందుకు వంటకాలు కుమార అనంతరాజు నిర్మించాడు. సంజీవరాయ స్వామి ఆలయం రామ తీర్థం ఎప్పుడు తయారయ్యాయో తెలియదు. మట్ల వారి తరువాత మరో వంద సంవత్సరాలకు సిద్దిరాజు అనే ఆయన జయ విజయులను నిలిపాడు. ఇది ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం సంక్షిప్త చారిత్రక సమాచారం.