తెదేపా ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వమని, రైతులకు అండగా ఉంటుందని జిల్లా ఇన్ ఛార్జి మంత్రి ఎస్.సవిత తెలిపారు. కమలాపురం నియోజక వర్గం వీరపు నాయుని పల్లె లో ఉల్లి రైతులకు ఆర్థిక సహాయం పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ఆర్థిక ఇబ్బందులల్లో ఉన్నా ఉల్లి రైతులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిహారం మంజూరు చేసి అండగా నిలిచారన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా వ్యాప్తంగా 7,298 మందికి నష్టపరిహారం అందిస్తున్నట్లు వెల్లడించారు. అందులో రూ.70వేలు పరిహారం అందుకున్న వారు 1592 మంది ఉన్నారని, రూ.60వేలు రూపాయలు అందుకున్న వాళ్ళు 660 మంది ఉన్నారని తెలిపారు. జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ చెరుకూరి మాట్లాడుతూ ఎకరాకు రూ.20వేలు ఇన్ పుట్ సబ్సిడీ (DBT ద్వారా) 7,800 రైతులకు మొత్తం రూ.28 కోట్లు జమ చేశారని తెలిపారు. కడప జిల్లాను హార్టికల్చర్ హబ్‌గా మార్చేందుకు డ్రిప్ ఇరిగేషన్‌కు రూ.40వేలు నుంచి రూ. 50వేలు రాయితీ, ప్లాంటేషన్ పంటలకు (చీనీ, బత్తాయి, నిమ్మ, మామిడి) మొదటి 3 సంవత్సరాలు 90% సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఎప్పుడూ రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని అన్నారు. సమావేశంలో డీఆర్వో విశ్వేశ్వర నాయుడు, తెదేపా నాయకులు పుత్తా నరసింహారెడ్డి, భూపేష్ రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి చంద్రా నాయక్, మార్కెటింగ్ ఏడీ పరిమళ తదితరులు పాల్గొన్నారు.
