
వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలోని బ్రహ్మంగారిమఠంలో కాలజ్ఞానకర్త పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి సజీవ సమాధి అయిన బ్రహ్మంగారిమఠం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రసాద పథకం కింద రూ.45కోట్లు మంజూరు చేయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కోరినట్లు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ తెలిపారు. అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన ఎమ్మెల్యే వినతిపత్రం సమర్పించి నిధుల మంజూరుకు కేంద్రానికి సిఫారసు చేయాలని కోరినట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి డీపీఆర్ తయారీకి ఆదేశించినట్లు వివరించారు. స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం కోసం మైదుకూరు పర్యటన సందర్భంగా ఇచ్చిన హామీల మేరకు నిధులు మంజూరు చేయాలని కోరినట్లు వివరించారు.