రోడ్డు భద్రత చర్యలను జిల్లాలో మరింత కఠినతరం చేసి రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సంబందిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లోని బోర్డు రూమ్ హాలులో జిల్లా రవాణాశాఖ ఆధ్వర్యంలో జిల్లా రహదారుల భద్రతా సమన్వయ కమిటీ సమావేశం సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్న రహదారులపై ఎన్ ఫోర్స్ మెంట్ చర్యలను కఠినతరం చేయాలని, ప్రధాన రహదారుల్లో డివైడర్లను బ్రేక్ చేసి వాహన ప్రమాదాలకు అవకాశం కల్పిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. రియల్టర్లు, రాజకీయ ప్రమేయాలకు స్పందించకుండా రోడ్డు భద్రత చూడాలన్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయాల్లో 108 వాహన సేవలు సకాలంలో అందేలా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యా సంస్థలు వద్ద స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు, పెట్రోల్ బ్యాంకులు, కమర్షియల్ కాంప్లెక్స్ ల వద్ద సీసీ కెమెరాలు, మలుపుల వద్ద బ్యారికెడ్, స్టాపర్స్, ప్రమాద సంకేత సూచికలను ఏర్పాటు చేయాలన్నారు. స్పీడ్ లిమిట్ డిస్ ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని నేషనల్ హైవే అథారిటీ అధికారులను ఆదేశించారు.అతివేగం, డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్,సీట్ బెల్ట్ లేకుండా వాహనం నడపడం, పరిమితికి మించి ఆటోలు నడపడం, బస్సులు ఇతర వాహనాలలో అధిక లోడుతో సరుకు, ఇతర సామగ్రి రవాణా చేసే వారిపై.. కఠిన చర్యలు తీసుకోవలసిందిగా రవాణ శాఖ అధికారులను ఆదేశించారు. ట్రాన్స్ పోర్ట్, పోలీసు శాఖల ఆధ్వర్యంలో అంతర్ జిల్లా సరిహద్దుల చెక్ పోస్టులను ఏర్పాటు చేయాలన్నారు. గువ్వల చెరువు ఘాట్ రోడ్డు ప్రమాదాలపై టోల్ గేట్ ల వద్ద పాంప్లేట్ ముద్రించి ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. గువ్వల చెరువు ఘాట్ దిగే మలుపు వద్ద రోడ్డును విస్తరించాలన్నారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి కేసులు ఫైల్ చేయాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో కమర్షియల్, అధిక జన సంచార ప్రాంతాల్లో రోడ్డు భద్రతా చర్యల్లో ఆయా మున్సిపల్ కమిషనర్లు భాగస్వామ్యం కావాలన్నారు. ప్రజల ప్రాణ భద్రత కోసం రూల్స్ అతిక్రమించే వారిపై ఫైన్లు, కేసులు నమోదు చేయాలన్నారు. అన్ని విద్యా సంస్థల్లో రహదారుల భద్రతకు అవసరమైన నియంత్రణ చర్యలు, అత్యవసర సహాయక చర్యలు, నియమ నిబంధనలు మొదలైన వాటిపై అవగాహన కల్పించాలన్నారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ మనోజ్ రెడ్డి, కమిటీ సభ్యులైన రోడ్ సేఫ్టీ ఎన్జీవో జిల్లా అధ్యక్షుడు జి.వి రమణ, వైద్య ఆరోగ్యశాఖ, ఆర్ అండ్ బి శాఖ అధికారులు, విద్యుత్ శాఖల ఎస్.ఈ.లు, మున్సిపల్ కమిషనర్లు, నేషనల్ హైవేస్ అథారిటీ అధికారులు, ట్రాఫిక్, పోలీసు, రవాణా శాఖ అధికారులు,కమీటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
