పుష్పగిరిలో జైనమత ఆనవాళ్ళు
కడప జిల్లా పుష్పగిరిలో 10 శతాబ్దం నాటి జైన పాదుకలు వెలుగు చూసినట్లు రచయిత తవ్వా ఓబులరెడ్డి తెలిపారు. పుష్పగిరి లో వైష్ణవ, శైవ, వీరశైవ, శాక్తేయ, అఘోర, కాపాళిక మత శాఖలకు సంబంధించిన ఆలయాలకు, చారిత్రక ఆనవాళ్ళకు నిలయంగా ఉండగా తాజాగా జైన పాదుకల ఆవిష్కరణతో పుష్పగిరి మత సాంస్కృతిక చరిత్రకు జైనమత ఆనవాళ్లు తోడైనట్లు రచయిత తవ్వా ఓబుల్ రెడ్డి తెలిపారు. క్రీ.శ. 10-13 శతాబ్దాల్లో కర్నాటకలోని గుల్బర్గా సమీపంలోని ‘ ‘మాన్యఖేత’ రాజధానిగా కడప, అనంతపురం ప్రాంతంలోని రేనాడు, ములికినాడు ప్రాంతాలను పాలించిన రాష్ట్ర కూటులు జైన, హిందూ మతాల్ని పోషించారు. జిల్లాలోని దానవులపాడు లో లభించిన జైనమత ఆనవాళ్ళు రాష్ట్రకూట రాజైన మూడవ ఇంద్రుని కాలంనాటివిగా గుర్తించారు. అలాగే రాష్ట్ర కూటరాజు మూడవ కృష్ణుని దానశాసనం గతంలో పుష్పగిరిలో వెలుగు చూసింది. అయితే ఆ శాసనం పుష్పగిరిలోని నాగేశ్వర, పుష్పేశ్వర హిందూ ఆలయాలకు సంబంధించినది కావడంతో రాష్ట్రకూటులు హిందూమతాన్ని కూడా అవలంభించారని చెప్పవచ్చు. ప్రముఖ చరిత్రకారుడు శ్రీరామోజు హరగోపాల్ ఈ విషయమై స్పందిస్తూ పద్మపత్రాల మధ్య ఉన్న పాదుకలను ఆరాధించడం జైన సాంప్రదాయంలో ఒక ఆచారమని చెప్పినట్లు ఓబుల్ రెడ్డి వివరించారు.
