కులవృత్తి గొప్పదనాన్ని, వైభవాన్ని, ప్రభావాన్ని, జీవనాధారాన్ని పెంపొందించడమే.. సాంకేతికతకు మూలపురుషుడైన శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతి ప్రధాన ఉద్దేశ్యమని జిల్లా రెవెన్యూ అధికారి ఎం. విశ్వేశ్వర నాయుడు అన్నారు. బుధవారం కలెక్టరేట్ లోని పిజీఆర్ఎస్ హాలులో జిల్లా బీసీ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో విరాట్ విశ్వకర్మ జయంతి వేడుక నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ ప్రపంచ తొలి వాస్తు శిల్పి, సృష్టికర్తగా.. ప్రవచనకారులు దేవశిల్పి విశ్వకర్మను ప్రస్తావించడం సమంజసమైనదన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలతో ప్రపంచపు తొలి వాస్తుశిల్పిగా, సృష్టి కర్తగా పేరు గాంచిన విశ్వకర్మ భగవానుని జన్మదినాన్ని ఏటా సెప్టెంబర్ 17న “విశ్వకర్మ జయంతి” గా జరుపుతున్నట్లు పేర్కొన్నారు.
విశ్వబ్రాహ్మణ అని కూడా పిలువబడే విశ్వకర్మ సంఘం భారతదేశంలోని ఒక గొప్ప సామాజిక సమూహంగా.. అందులో ఉప సమూహాలైన కమ్మరి, వడ్రంగి, కాంస్య కమ్మరులు, శిల్పులు మరియు స్వర్ణకారులు మొదలైన కులవృత్తుల వారందనినీ విశ్వకర్మ వారసులన్నారు. ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చేసే క్రమంలో కేంద్ర ప్రభుత్వం విశ్వకర్మ యోజన పథకం కింద రూ.లక్ష రూపాయల రుణాన్ని అందించడం జరుగుతోందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ.. సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రజలకు సూచించారు. రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ డా. శ్రీనివాసా చారి, ఎస్డీసి వెంకటపతి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ, డీఆర్డీఏ పీడి రాజ్యలక్ష్మి, బీసీ వెల్ఫేర్ అధికారి అంజలి పాల్గొన్నారు.
