ఎడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి. 1949 జూలై 8. జమ్మలమడుగు సి.ఎస్.ఐ. క్యాంబెల్ మిషన్ ఆసుపత్రిలో జన్మించారు. రాజశేఖరరెడ్డి తండ్రి రాజారెడ్డి కర్నాటక రాష్ట్రంలోని బళ్ళారిలో గుత్తేదారుగా పనిచేస్తుండటంతో రాజశేఖరరెడ్డి పాఠశాల చదువు బళ్ళారిలోని సెయింట్ జాన్స్ పాఠశాలలో సాగింది. విజయవాడ లయోలా కళాశాలలో చేరారు. 1972లో గుల్బర్గాలోని మహాదేవప్ప రాంపూరే వైద్య కళాశాలలో వైద్యవిద్యలో పట్టా తీసుకున్నారు. వైద్యవృత్తిని అభ్యసిస్తుండగానే కళాశాలలో విద్యార్ధి సంఘానికి అధ్యక్షుడిగా వ్యవహరించారు.తిరుపతిలోని వెంకటేశ్వర వైద్యకళాశాల నుంచి హౌస్‌సర్జన్ పట్టా పొందారు. విద్యార్థి దశ నుంచే రాజకీయాల వైపు ఆకర్షితుడైన రాజశేఖరరెడ్డి వెంకటేశ్వర వైద్యకళాశాలలో హౌస్‌సర్జన్ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.
1978 ఎన్నికల్లో పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మొదటిసారిగా శాసనసభ పోటీ చేశారు. అప్పట్లో జనతా పార్టీ ప్రభంజనాన్ని తట్టుకొని విజయం సాధించారు. అప్పడేప్రతి ఎన్నికల్లోనూ విజయం ఆయననే వరించింది. ఆ తరువాత వెనువెంటనే ముగ్గురు ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రులు మారిననూ ఆ మూడు మంత్రిమండళ్లలో స్థానం సంపాదించాడు. ఆ తరువాత చాలా కాలం పాటు ఎటువంటి ప్రభుత్వ పదవీ దక్కలేదు. 1989-94 మధ్య ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నించినా అవకాశం రాలేదు. 1999లో మళ్ళీ శాసనసభకు ఎన్నికై ప్రతిపక్షనేతగా ఉంటూ తదుపరి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు వ్యూహం రచించాడు.
కళాశాల దశ నుంచే రాజకీయాలపై ఆసక్తి చూపిన రాజశేఖరరెడ్డి 1980-83 కాలంలో రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిపదవిని నిర్వహించాడు. కడప లోక్‌సభ నియోజకవర్గం నుంచి 4 సార్లు ఎన్నికయ్యాడు. పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 6 సార్లు విజయం సాధించాడు. రాష్ట్ర శాసనసభ ప్రతిపక్షనేతగానూ, రెండు సార్లు రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రేస్ కమిటీ అధ్యక్షుడిగానూ పనిచేశాడు. 1980 నుంచి 1983 దాకా గ్రామీణాభివృద్ధి, వైద్యశాఖ, విద్యాశాఖ మొదలైన కీలకమైన మంత్రి పదవులను నిర్వహించాడు. తెలుగు దేశం నేత నారా చంద్రబాబు నాయుడు మొదటగా కాంగ్రెస్ లో ఉన్నపుడు ఇరువురూ మంచి మిత్రులు. 1985 నుంచి 1998 వరకు పార్టీలో వై.ఎస్. నిత్య అసమ్మతివాదిగా పేరుపడ్డారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రులందరితో ఆయన పోరాటం చేయాల్సి వచ్చింది. 1989-94 మధ్య కాలంలో ముఖ్యమంత్రి కావాలని ప్రయత్నించినా సాధ్యపడలేదు. మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి, కోట్ల విజయ భాస్కర్ రెడ్డి వంటి నేతలతో ఆయన రాజకీయ యుద్ధమే చేశారు. వారికి వ్యతిరేకంగా క్యాంపులు నడిపాడు. మర్రి చెన్నారెడ్డిని, నేదురుమిల్లి జనార్ధన్‌రెడ్డిని పదవినుండి తొలగించడానికి ప్రధాన కారణమైన హైదరాబాదు నగరంలో జరిగిన అల్లర్లలో రాజశేఖర్ రెడ్డి వర్గపు పాత్ర ఉందన్న ఆరోపణలు వచ్చాయి. అదే తాను ముఖ్యమంత్రి అయ్యేనాటికి అలాంటి శిబిరాలు లేని పరిస్థితిని సృష్టించుకోగలిగాడు. రాజకీయాల్లో ముక్కుసూటితనానికి, నిర్మొహమాట ధోరణికి రాజశేఖరరెడ్డి ప్రసిద్ధుడు.
కొద్దిరోజులపాటు జమ్మలమడుగులోని సి.ఎస్.ఐ. కాంప్‌బెల్ ఆసుపత్రిలో వైద్య అధికారిగా పనిచేశాడు. ఆ తరువాత 1973లో పులివెందులలో తండ్రి వై.ఎస్.రాజారెడ్డి పేరుతో కట్టించిన 70 పడకల ఆసుపత్రిలో వైద్యుడిగా పనిచేశాడు. ఆ ఆసుపత్రి ఇప్పటికీ పనిచేస్తూనే ఉంది. వాళ్ళ కుటుంబం పులివెందులలో ఒక పాలిటెక్నిక్ కళాశాల మరియు డిగ్రీ కళాశాలను కూడా నెలకొల్పారు. తరువాత వాటిని లయోలా సంస్థలకు అప్పగించారు. పులివెందుల దగ్గరిలో ఉన్న సింహాద్రిపురంలో ఉన్న కళాశాలను మాత్రం ఇప్పటికీ వీరి కుటుంబమే నిర్వహిస్తోంది.
2003లో మండువేసవిలో 1460 కిలోమీటర్లు సాగిన పాదయాత్ర మరియు ఉచిత విద్యుత్ ప్రచారం అతని విజయానికి బాటలు వేసింది. 2004 ఎన్నికలలో పులివెందుల నియోజకవర్గం నుంచి 40వేలకు పైగా మెజారిటీతో విజయం సాధించడమే కాకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలు పొందడంతో ముఖ్యమంత్రి పీఠం వై.ఎస్.రాజశేఖరరెడ్డికే దక్కింది. ఆయన సెప్టెంబర్ 2, 2009న చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమానికి హాజరవడానికి వెళ్తూ నల్లమల అడవులలో హెలికాప్టర్ ప్రమాదానికి గురై దుర్మరణం పాలయ్యారు. 1975లో యవజన కాంగ్రెస్ కార్యదర్శిగా నియమితులైన వైఎస్ 1978లో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం పొందారు. పోటీ చేసిన తొలిసారే శాసనసభకు ఎన్నికయ్యారు. అంతేకాదు తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేగానే మంత్రి పదవి కూడా చేపట్టారు. అలా 1980-82 వరకూ గ్రామీణాభివృధ్ధి శాఖ మంత్రిగా, 1982లో ఎక్సైజ్ మంత్రిగా, అనంతరం 1983 దాకా విద్యాశాఖ మంత్రిగా, 1999-2004 మధ్య కాలంలో ప్రతిపక్ష నేతగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడే దేశంలో తొలిసారి మధ్యాహ్న భోజన పథకాన్నిప్రవేశపెట్టారు. 1983లో తెలుగు సినీ సూపర్‌స్టార్ ఎన్టీఆర్ పార్టీ ప్రభంజనంలో అప్పటి కాంగ్రెస్ నేత అయిన చంద్రబాబు సహా ఎందరో ఓడిపోయినా వైయస్ మాత్రం చక్కని మెజార్టీతో గెలిచి ప్రజల మద్దతు ముందు ఎంతటి సినీ గ్లామరైనా దిగదుడుపేనని నిరూపించారు. పిసిసి అధ్యక్షునిగా 34 ఏళ్ల పిన్నవయసులోనే ఆయన నియమితులయ్యారు. సిఎం సీటు కోసం నాదెండ్ల చేసిన కుట్ర ఎన్టీఆర్‌కు అయాచిత వరం కావడంతో, పిసిసి అధ్యక్షుడిగా వైయస్ పడిన కష్టం కనపడకుండా పోయింది. దాని ఫలితమే.. అనంతరం జరిగిన ఎన్నికల్లో సానుభూతి పవనాలతో ఎన్టీఆర్ తిరిగి అధికారంలోకి వచ్చారు. దాంతో వైయస్, పిసిసి అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.
1986 జనవరి 1న ఆయన సారథ్యంలో సాగిన 500 కిలోమీటర్ల పాదయాత్ర అక్కడి సమస్యల్ని ఎలుగెత్తి చూపింది. మారిన రాజకీయ పరిస్థితిలో వైయస్ 1989లో లోక్‌సభకు పోటీచేసి దాదాపు 1.65లక్షల మెజారీటీతో గెలిచారు. ఆ ఒక్కసారే కాదు… 9,10,11,12వ లోక్‌సభలకు కడప నుంచి నాలుగుసార్లు ఎన్నికయ్యారు. 1991లో ఆయన సాధించిన 4.50 లక్షల మెజార్టీ అప్పట్లో భారతదేశంలోనే రెండవ అతిపెద్ద మెజార్టీ. 1998లో మరోసారి పిసిసి అధ్యక్ష పదవి చేపట్టి… చంద్రబాబు హైటెక్ ప్రచారాన్ని, మీడియా ఆయనకు అందించిన ఏకపక్ష మద్దతును ఓ పక్క తట్టుకుంటూనే, కాంగ్రెస్ పార్టీ స్థాయిని అసెంబ్లీలో 30 నుంచి 90 స్థానాలకు పెంచగలిగారు. 2003 ఏప్రిల్ 9న మొదలుపెట్టిన ఆయన పాదయాత్ర న భూతో న భవిష్యతి. ఆయన 3నెలల పాటు నిర్విరామంగా నడిచారు. కన్నీరు సైతం ఆవిరైపోయి, ఎండిన డొక్కలతో బిక్కుబిక్కుమంటున్న ప్రతి గుండెనూ తడిమారు. నేనున్నానంటూ ధైర్యం చెప్పారు.
పదవులు
1975 : యవజన కాంగ్రెస్ కార్యదర్శిగా నియామకం.
1980 : తొలిసారిగా రాష్ట్ర మంత్రివర్గంలో గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రిగా నియామకం.
1982 : రాష్ట్ర మంత్రివర్గంలో ఎక్సైజ్ శాఖా మంత్రి పదవి లభించింది.
1982 : రాష్ట్ర మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా నియామకం.
1983 : పిసిసి అధ్యక్షుడిగా నియమించబడ్డాడు (1985 వరకు).
1998 : రెండోసారి పిసిసి అధ్యక్షుడిగా నియామకం (2000 వరకు).
1999 : శాసనసభ ప్రతిపక్షనేతగా ఎన్నికయ్యారు.
2004 : ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నిక..
2009 : ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండోమారు ఎన్నిక.
విజయాలు
1978: పులివెందుల నియోజకవర్గం నుంచి తొలిసారిగా శాసనసభ్యుడిగా ఎన్నిక.
1983: పులివెందుల నుంచి రెండోసారి శాసనసభ్యుడిగా ఎన్నిక.
1985: పులివెందుల నుంచి వరుసగా మూడవసారి శాసనసభ్యుడిగా హాట్రిక్ విజయం.
1989: కడప నియోజకవర్గం నుంచి తొలిసారి పార్లమెంట్ సభ్యుడిగా విజయం.
1991: కడప నియోజకవర్గం నుంచి రెండోసారి పార్లమెంట్ సభ్యుడిగా గెలుపు.
1996:కడప నుంచి వరుసగా మూడవసారి గెలుపొంది హాట్రిక్ సాధించాడు.
1998: కడప నుంచి వరుసగా నాలుగవసారి ఎన్నికలలో విజయం సాధించాడు.
1999: పులివెందుల నుంచి నాలుగవసారి శాసనసభ్యుడిగా గెలుపు.
2004: పులివెందుల నుంచి ఐదవసారి శాసనసభ్యుడిగా విజయసాధించాడు.
2009: పులివెందుల నుంచి రెండోసారి హాట్రిక్ విజయం, శాసనసభ్యుడిగా గెలుపొందడం ఆరవసారి.
