వైఎస్సార్ కడప జిల్లాలో రాజంపేట నియోజకవర్గం కలవడంతో అత్యధిక మండలాలు కలిగిన జిల్లాగా వైయస్సార్ కడప జిల్లా నిలిచిందని జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్విభజనలో భాగంగా అన్నమయ్య జిల్లాలోని రాజంపేట నియోజకవర్గం లోని రాజంపేట, నందలూరు, వీరబల్లె, సుండుపల్లె మండలాలు జిల్లాలో విలీనమైనట్లు తెలిపారు. ప్రస్తుతం 40 మండలాలతో రాష్ట్రంలోనే అత్యధిక మండలాలు గల జిల్లాగా నిలిచిందని అన్నారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసిందని తెలిపారు. దీంతో రాజంపేట రెవెన్యూ డివిజన్ వైయస్సార్ జిల్లా పరిధిలో పనిచేస్తుందన్నారు. ఒంటిమిట్ట, సిద్ధపటం మండలాలు కడప జిల్లాలోని రాజంపేట నియోజకవర్గం లో భాగంగా ఉంటాయన్నారు.
రాజంపేట నియోజకవర్గంలోని 4 మండలాలు కలవడంతో ప్రస్తుతం కడప జిల్లా జనాభా 22,96,497 కు చేరిందని, అలాగే నందలూరులోని సౌమ్యనాథ ఆలయం, తెలుగు వాగ్గేయకారుడు అన్నమాచార్యుల గ్రామం తాళ్లపాక వైఎస్సార్ కడప జిల్లాలోకి రావడం జరిగిందన్నారు. రాజంపేట నియోజకవర్గంలోని మండలాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వైఎస్ఆర్ జిల్లాలో కలిపారని, రాజంపేట నియోజకవర్గం లోని 4 మండలాలకు కడప జిల్లాతో విద్యా, ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. ఈ నాలుగు మండలాలలో విద్యాసంస్థలు, ప్రభుత్వ, ఇతర సంస్థలు అన్ని కడప జిల్లాలో పరిధిలో పనిచేస్తాయని తెలిపారు.
కడప జిల్లా హార్టీ కల్చర్ హబ్ గా అభివృద్ధి చెందుతోందని, రాజంపేటలోని నాలుగు మండలాల్లో పండించే అరటి, చీని, నిమ్మ, మామిడి, బొప్పాయి వంటి పంటలు తోడు కావడంతో కడప జిల్లాకు హార్టికల్చర్ హబ్ గా మారడానికి మరింత ఊతమిస్తుందన్నారు. అలాగే రాజంపేట రెవెన్యూ డివిజన్లో ప్రతిరోజు యధావిధిగా ప్రభుత్వ సేవలు, సుపరిపాలన అందించాలని అధికారులకు సూచించారు. వందేళ్ల చరిత్ర కలిగిన రాజంపేట రెవెన్యూ డివిజన్ కు మౌలిక వసతుల్లో ఎలాంటి ఇబ్బందులు లేవని ఇంకా ఏమైనా కావాల్సి ఉంటే సమకూరుస్తామన్నారు.
వైయస్సార్ కడప జిల్లాకు 2025 సంవత్సరం అత్యంత ప్రతిష్టాత్మకమైన సంవత్సరం గా అభివర్ణించారు. దేశవ్యాప్తంగా నీతి అయోగ విడుదల చేసే యాస్పిరేషనల్ డిస్టిక్స్ విభాగంలో అన్ని పారామీటర్లలో ప్రథమ స్థానాన్ని సంపాదించి దేశంలోనే ప్రథమ ర్యాంకును సాధించినందుకు గర్వంగా ఉందని జిల్లా కలెక్టర్ సంతోషం వ్యక్తం చేశారు. జాతీయస్థాయిలో అత్యున్నత గుర్తింపు రావడం జిల్లాలో అన్ని శాఖల పరంగా శాఖల అధికారులు చేపట్టిన విజయంగా చెప్పవచ్చన్నారు. ఈ విజయానికి సహకరించిన జిల్లాలోని అన్ని శాఖల అధికారులు, సిబ్బంది, ప్రజా ప్రతినిధులు ప్రతి ఒక్కరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామన్నారు.
రెవెన్యూ వ్యవస్థలో ఉన్నటువంటి సమస్యలను మరింత సమర్థవంతంగా పరిష్కరించే దిశగా “రెవెన్యూ క్లినిక్” అనే విధానాన్ని కొత్త సంవత్సరం లో వచ్చే సోమవారం నుంచి అన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో, అన్ని మండల కేంద్రాల్లోని తహసీల్దార్ కార్యాలయాల పరిధిలో అమలు చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. ఈ కార్యక్రమాన్ని కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరుగుతుందన్నారు.
జిల్లాలో అమలు చేస్తున్న స్మార్ట్ కిచెన్ ప్రోగ్రాం దేశంలోనే ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు జిల్లాలో ప్రతిరోజు 10వేల మందికి పైగా మధ్యాహ్నం భోజన పథకం కింద పౌష్టికాహారం అందిస్తున్నామన్నారు. అలాగే జిల్లావ్యాప్తంగా మరో 33 స్మార్ట్ కిచెన్ ల పనులు వివిధ దశల్లో పురోగతిలో వున్నాయని జనవరి 26 నుంచి అమల్లోకి వస్తే 1.29 లక్షల మందికి విద్యార్థులకు ప్రతిరోజు రుచికరమైన పౌష్టికాహారం అందించే విధంగా లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు ఇందుకు సహకరించిన పత్రికా విలేకరులు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.అలాగే రాజంపేటలోని 4 మండలాలకు కూడా స్మార్ట్ కిచెన్ ప్రోగ్రాం పథకాన్ని అమలు చేస్తామని తెలిపారు.
పి ఫోర్ లో భాగంగా ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న స్టార్ట్ అప్ కడప సెంటర్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. రానున్న మరో మూడు నెలలలో అందుబాటులోకి రానుందని దీని ద్వారా యువత పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి ఉపాధి అవకాశాలు రావడానికి తోడ్పడుతుందని తెలిపారు. జిల్లాకు తలమాలికంగా నిలిచిన గండికోట లో అత్యంత వైభవంగా గండికోట ఉత్సవాలను జనవరి నెలలో 11, 12, 13 తేదిలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.ఇందుకు సంబంధించి సలహాలు సూచనలు తెలియజేయాలని కోరారు.
