వచ్చే ఏడాది జనవరిలో గండికోట ఉత్సవాలు నిర్వహించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. మొదటి నాలుగు రోజులు ప్రమోషనల్ ఈవెంట్స్, మిగతా మూడు రోజులు ముఖ్యమైన ఈవెంట్స్ నిర్వహించాలని సూచించారు. ముఖ్యమైన ఈవెంట్లలో భాగంగా నిర్వహించే ప్రదర్శనల్లో జాతీయ స్థాయిలో పేరు పొందిన మ్యూజిక్, డాన్స్ బృందాలను ఆహ్వానించాలని పేర్కొన్నారు. గండికోట ఉత్సవాల్లో స్వయం సహాయక గ్రూపు సంఘాలతో జిల్లా స్ట్రీట్ ఫుడ్, ఎగ్జిబిషన్ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. గండికోట ఉత్సవాల నేపథ్యంలో గండికోట ప్రాంత పరిసర ప్రాంతాలను విద్యుద్దీపాలతో అలంకరించాలని అన్నారు. మౌలిక వసతులు, మరుగుదొడ్లు, పారిశుద్ధ్య అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. అలాగే గండికోట టూరిజంకు ప్రత్యేకంగా ఆహ్వాన బోర్డులను శాశ్వత ప్రాతిపదిక ఏర్పాటు చేయాలని, మైలవరం బోటింగ్, అడ్వెంచర్ ఆక్టివిటీస్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. గండికోట చరిత్రపై సురభి నాటక బృందంతో ప్రత్యేకంగా కార్యక్రమాన్ని నిర్వహించేలా సన్నాహాలు చేయాలన్నారు. గండికోట ఉత్సవాలను ప్రమోట్ చేసేలా బైక్, సైక్లింగ్ వంటి ఈవెంట్లతో పాటు బెంగళూరులో ప్రమోషనల్ ఈవెంట్ కు ప్రణాళికలు చేయాలన్నారు. జిల్లాను పర్యాటక హబ్ గా తీర్చిదిద్దే విధంగా కృషి చేయాలని అధికారులకు సూచించారు. టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం కి మంచి అవకాశాలున్నాయని ఈ నేపథ్యంలో పర్యాటకులకు మధురానుభూతులు మిగిల్చేలా పర్యాటక టూరిజంను అభివృద్ధి చేయాలన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ తో పాటు జెసి అదితి సింగ్,డి ఎఫ్ ఓ వినీత్ కుమార్, డీఆర్వో విశ్వేశ్వర నాయుడు, కడప మున్సిపల్ కమిషనర్ మనోజ్ రెడ్డి, జమ్మలమడుగు ఆర్టీవో సాయి శ్రీ, జిల్లా పర్యాటకశాఖ అధికారి సురేష్, డిఆర్డిఏ పిడి రాజ్యలక్ష్మి, కిరణ్ కుమార్, డిఆర్ఓ విశ్వేశ్వర నాయుడు తదితరులు పాల్గొన్నారు.
