జిల్లా ప్రజలకు త్వరలో అధునాతన విమానయాన సర్వీసులు చేరువ కానున్నట్లు కడప పార్లమెంట్ సభ్యులు వై.ఎస్.అవినాష్ రెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ లోని పీజీఆర్ఎస్ హాలులో ఎయిర్ పోర్ట్ అడ్వైజరీ కమిటి సమావేశం నిర్వహించారు. సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ ఎయిర్ పోర్టు నూతన టర్మినల్ బిల్డింగ్ కు నూతన రహదారుల ఏర్పాటు, అధునాతన స్నాక్ బార్ & ఫుడ్ ఫెసిలిటీ, ఎయిర్ పోర్ట్ వద్ద బస్టాప్ ఏర్పాటు, మెరుగైన కార్గో సర్వీసులు, వాణిజ్య పరంగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ (ఎఫ్.టీ.ఓ.), ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెన్స్, రిపేర్ & ఓవరాల్ (ఎం.ఆర్.ఓ.) తదితర అంశాలపై ఎయిరోడ్రమ్ చైర్మన్, కమిటీ సభ్యులతో సమీక్షించారు. ఎంపీ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ కడప విమానాశ్రయ అభివృద్ధిలో భాగంగా గతంలో చేసిన ప్రతిపాదనల ఆమోదంతో ఎయిర్ పోర్ట్ విస్తరణకు 75 ఎకరాల భూసేకరణ, నైట్ ల్యాండింగ్ కోసం సదుపాయాలు, న్యూ టెర్మినల్ బిల్డింగ్ ప్రజలకు అందుబాటులోకి రానున్నాయని, ఈ విషయం జిల్లా ప్రజలకు శుభపరిణామం అన్నారు. ప్రయాణీకుల అవసరాలను ఎప్పటికప్పుడు గుర్తించేలా.. ఎయిర్ పోర్టులో ఒక ప్యాసింజర్స్ సలహాల బాక్సును ఏర్పాటు చేయాలని సూచించారు. ఎయిర్ పోర్టు ఎంట్రన్స్ వద్ద బస్ స్టాప్ ను ఏర్పాటు చేయాలని కమిటీ దృష్టికి తెచ్చారు. అంతేకాకుండా ఎయిర్ పోర్టు ప్రధాన ద్వారం నుండి టెర్మినల్ భవనం వరకు ప్రయాణీకులను చేర్చేందుకు ఎంపీ నిధుల ద్వారా ఆరు సీట్ల బ్యాటరీ కార్ ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్ వెళ్ళలాంటే ఎప్పుడూ టికెట్స్ ఫుల్ అవుతున్న సందర్భాలు ఉన్నాయని… ఆ పరిస్థితిని అధిగమించేందుకు అదనంగా ఇంకో విమాన సర్వీసును కూడా అందించేందుకు ఇండిగో ఎయిర్ లైన్స్, కేంద్ర ప్రభుత్వాన్ని ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వారిని కూడా కోరుతామన్నారు.
జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం పౌర విమానయాన సేవారంగంలో ప్రయాణీకుల అనుభవాలు, సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని.. భారతీయ విమానాశ్రయాలను ఉన్నత ప్రమాణాలతో అంతర్జాతీయ స్థాయికి దీటుగా అభివృద్ధి చేస్తోందన్నారు. ఆధునిక జీవనశైలికి అనుగుణంగా విమానాశ్రయాల్లో ప్రయాణీకులకు సౌకర్యాలను మెరుగు పరుస్తోందన్నారు. ఎయిర్ పోర్ట్ నూతన టర్మినల్ అభివృద్ధి పనుల్లో భాగంగా.. ఎయిర్ పోర్ట్ అథారిటీ, ఆర్&బి, నేషనల్ హైవే, పోలీస్ శాఖలు జాయింట్ కమిటీగా ఏర్పాటై.. అందుకు సంబంధించిన రోడ్లు, రవాణా వ్యవస్థ తదితర మౌలిక సదుపాయాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తుందన్నారు. మౌలిక సదుపాయాల్లో భాగంగా.. ప్రధానంగా మెరుగైన రోడ్లు, నిరంతర నీటి సదుపాయాలను కల్పించాలన్నారు. ఏపీఎస్పీఎస్ లో భాగంగా కొరత ఉన్న భద్రతా సిబ్బందిని కుడా పూరించేందుకు సహకారం అందిస్తామన్నారు. ఏరో డ్రమ్ లో భద్రతా వాహనాల ఏర్పాటు కోసం.. రెవెన్యూ, కడప మున్సిపల్ కార్పోరేషన్, పోలీసు శాఖల సమన్వయ నిర్ణయంతో ముందుకు సాగడం జరుగుతుందన్నారు. ఎయిర్ పోర్ట్ పరిసరాలను స్వచ్చంగా, పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా ఉంచడంలో కడప మున్సిపల్ కమిషనర్, పంచాయతీ రాజ్ శాఖలు ప్రత్యేక బాధ్యత తీసుకోవాలన్నారు. ఎయిర్ పోర్ట్ నూతన టర్మినల్ భవన నిర్మాణ పనుల్లో భాగంగా.. పర్యావరణానికి ఎలాంటి అంతరాయం కలగకుండా ఏరో డ్రమ్ నిర్మాణ పనులను చేపట్టేందుకు సంబందిత శాఖలు చర్యలు తీసుకోవాలన్నారు. ఎయిర్ పోర్ట్ అభివృద్ధికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరపున, జిల్లా యంత్రాంగం తరపున పూర్తి స్థాయి సహాయ సహకారాలు అందిస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు.
జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ మాట్లాడుతూ.. ఎయిర్ పోర్టు పరిధిలో అన్ని రకాల భద్రతా చర్యలతో పాటు.. ఎయిర్ పోర్టు ఎదురుగా.. నేషనల్ హైవే మీద వాహనాల వేగాన్ని అరికట్టే చర్యలను కూడా చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏయిర్ పోర్ట్ డీజీఎంలు రాజేశ్వర్, తిరుమల మురగన్, ఆపరేషన్ ఇన్ ఛార్జ్ దామోదర్ తోపాటు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
