ఈనెల 11వతేది నుంచి మూడురోజులపాటు పర్యాటకశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే గండికోట ఉత్సవాల నిర్వహణకు ముందస్తు ప్రణాళికతో సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ అధికారులను ఆదేశించారు. జమ్మలమడుగు నియోజకవర్గం గండికోటలో గండికోట ఉత్సవాల నిర్వహణ, సాస్కి పర్యాటక అభివృద్ధి పనులు, సభా వేదిక, స్టాల్స్ ఏర్పాటు, పార్కింగ్ వంటి అంశాలపై పరిశీలించారు. గండి కోట ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు తయారు చేసిన కార్యాచరణ ప్రణాళిక మేరకు దిశా నిర్దేశం చేశారు.
గండికోట ఉత్సవాలను జిల్లా పర్యాటక, చారిత్రక, సాంస్కృతిక వైభవాన్ని దేశం నలు దిక్కులా చాటేలా ప్రధానమైన పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు. గండికోట ప్రాంతాన్ని సాస్కీ పథకం కింద రూ.79 కోట్లతో అభివృద్ధి చేసి అద్భుతమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. పర్యాటకులు బస చేసేలా స్టార్ హోటళ్లతోపాటు ఇతర ఆకర్షణీయమైన నిర్మాణాలు చేపట్టాలన్నారు. పర్యాటకులకు సంతృప్తి కరమైన అనుభూతిని అందించేందుకు 10,000 SFT విస్తీర్ణంలో టూరిస్టు ఎక్స్ పీరియన్స్ సెంటర్ ను, 4000 SFT విస్తీర్ణంలో రెండు అమినిటీస్, ఇన్ఫర్మేషన్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు. అలాగే ఒక టెంట్ సిటీ, 1.5 కిలో మీటరు మేరా గండికోట ఫోర్టు నుండి విజిటర్స్ సెంటర్ వరకు వాకింట్ ట్రెయల్ ను నిర్మించడం జరుగుతోందన్నారు. ఈ మార్గం మొత్తం కూడా వెహికల్ ఫ్రీ జోన్ గా కేటాయించి.. ఈ మార్గానికి ఇరువైపులా పర్యాటకులు చక్కటి ఆహ్లాదకరమైన అనుభూతిని పొందేలా పలు ప్రత్యేక నిర్మాణాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. గండికోట కొట్టాలపల్లె నుండి గండికోట రిజర్వాయర్, డ్యామ్ అందాలను వీక్షించడం తో పాటు.. ఆ మార్గాన్ని కలిపే అనుకూలతలను, గండికోట గార్జ్ వ్యూ పాయింట్ ను పరిశీలించారు.
